Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్జీఎస్ యూఈ 2021 బ్రోచర్ విడుదల

జీఎస్ యూఈ 2021 బ్రోచర్ విడుదల

సిఎం జగన్ నాయకత్వంలో మారుతున్న కాలానికి తగ్గట్లు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కోవిడ్ విపత్తు వచ్చినా దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఇప్పటికే లక్షలాది మందికి ఉద్యోగాలందించామని వివరించారు. ఈ ఏడాది నవంబర్ 18న విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్టార్టప్ కాంగ్రెస్ అండ్ ఎక్స్ పో (జీఎస్ యూఈ 2021) ఐ.టీ స్టార్టప్ బ్రోచర్ ని వెలగపూడి సచివాలయంలో మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.

ఐ.టీ, విద్యా, నైపుణ్యం, స్టార్టప్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారుతోందని ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. విద్య, నైపుణ్య, ఐ.టీ రంగాలలో ముఖ్యమంత్రి నాయకత్వంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఐ.టీ, నైపుణ్య,విద్య, పరిశ్రమ రంగాలలో ప్రతి రోజూ అనేక మార్పులు జరుగుతున్నాయని, కోవిడ్ వల్ల ఊహించని విధంగా టెక్నాలజీ ఆవశ్యకత మరింత పెరిగిందని వెల్లడించారు. సాంకేతికతోనే చిన్నారులకు, యువతకు బంగారు భవిష్యత్ ఉంటుందని, ఎన్నటికీ వన్నెతరగనిది, విలువ తగ్గనిది సాంకేతిక,విద్య, నైపుణ్యం మాత్రమేనని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐ.టీ, విద్యా శాఖలు ఈ జీఎస్ యూఈ 2021 ఎక్స్ పోను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఆగస్ట్ 18న ఎక్స్ పో పూర్తి షెడ్యూల్ విడుదలా కానుంది. జులై 18న సమావేశానికి సంబంధించిన ముఖ్య సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది టెక్నాలజీ, నైపుణ్యం, విద్య, స్టార్టప్, పారిశ్రామిక రంగాల నిపుణులు హాజరుకానున్నారు, వందలాది పరిశ్రమలు, కంపెనీల ఆధ్వర్యంలో 3 రోజులపాటు జరిగే ఈ గ్లోబల్ ఎక్స్ పో లో పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పాలసీ తయారీదారులు, స్కాలర్లు, వివిధ ప్రభుత్వ శాఖల సభ్యులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొంటారు. విద్య, సాంకేతిక, నైపుణ్యరంగాల నిష్ణాతులు వారి నూతన ఆలోచనలను ఎక్స్ పో వేదికగా పంచుకోవడమే ఈ సదస్సు లక్ష్యం.

నవంబర్ 18,19,20 తేదీల్లో జరిగే ఈ సమావేశానికి కోవిడ్ నియమ, నిబంధనలు, ఆంక్షల నేపథ్యంలో వర్చువల్ గానూ హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తున్నారు. ముఖాముఖి కార్యక్రమాలు, ప్రాడక్ట్ డెమోలు, వర్చువల్ షో రూమ్ లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ట్రేడ్ షోలకు జీఎస్ యూఈ-2021లో పెద్దపీట వేస్తున్నారు. భారతదేశం, భారత దేశ యువత సామర్థ్యపు వెలుగులను దశదిశలా చాటే దిశగా ప్రపంచస్థాయి టెక్ మార్క్ టీమ్ ఈ సదస్సులో భాగస్వామ్యం అవుతోంది. స్టార్టప్, ఎంటర్ ప్రినర్లుగా విజయం సాధించిన 50 శాతం మహిళలు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్