Saturday, November 23, 2024
HomeTrending Newsప్రధానమంత్రికి విపక్ష నేతల సంయుక్త లేఖ

ప్రధానమంత్రికి విపక్ష నేతల సంయుక్త లేఖ

కేంద్రంలో బిజెపి ప్రభుత్వంపై పోరాడేందుకు విపక్షాలు క్రమంగా ఒక్క తాటిపైకి వస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేవలం ప్రతిపక్ష పార్టీలను కట్టడి చేసేందుకే వాడుతున్నారని అన్ని పార్టీల నేతలు విరుచుకు పడ్డారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ ప్రధానమంత్రి కి ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు  సంయుక్త లేఖ రాశారు.

లేఖలో ముఖ్యాంశాలు

గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి,
భారతదేశం ఇంకా ప్రజాస్వామ్య విలువలను పాటించే దేశమేనని మీరు అంగీకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను పచ్చిగా దుర్వినియోగ పరచడం చూస్తుంటే మనం ప్రజాస్వామ్య నుంచి నిరంకుశ పాలన దిశగా పరిణామం చెందుతున్నట్టుగా అనిపిస్తున్నది.
దర్యాప్తు, విచారణల పేరుతో సుదీర్ఘకాలం పాటు ఉద్దేశపూర్వకంగా వేటాడి వెంటాడి ఎటువంటి ఆధారాలు లేకుండానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26, 2023న అరెస్టు చేసింది. మనీష్ సిసోడియా గారిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, రాజకీయ కుట్రతో కూడినవి. వారి అక్రమ అరెస్టు దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. పాఠశాల విద్యలో గొప్ప సంస్కరణలను తీసుకొచ్చిన మనీష్ సిసోడియా ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందారు. ‘రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే లక్ష్యంతో చేపట్టే దురుద్దేశపూర్వక దర్యాప్తు లేదా చర్య’ ( Witch-Hunt) కు తార్కాణంగా మనీష్ సిసోడియా అరెస్టు నిలిచింది. నిరంకుశ బిజెపి పాలనలో, భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలకు ముప్పు వాటిల్లిందని అనుమానిస్తున్న ప్రపంచానికి మనీష్ సిసోడియా అక్రమ అరెస్టు వారి అనుమానాన్ని నిజం చేసింది.

మీ పరిపాలనలో 2014 నుండి దర్యాప్తు సంస్థలచే కేసులు నమోదు చేసి, అరెస్టు చేయబడిన, దాడులకు గురయి, విచారించబడిన మొత్తం ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఎక్కువగా ప్రతిపక్షానికి చెందినవారే వున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీరిలో బిజెపిలో చేరిన ప్రతిపక్ష రాజకీయ నాయకుల కేసుల పరిశోధనలో దర్యాప్తు సంస్థలు సంయమనంతో ఉదారంగా వ్యవహరిస్తున్నాయి.
ఉదాహరణకు, 2014, 2015 సంవత్సరాల్లో శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో కాంగ్రెస్ మాజీ సభ్యుడు, ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి (సిఎం) హిమంత బిస్వ శర్మ పై సిబిఐ, ఈడి విచారణ జరిపాయి. అయితే ఆయన బీజేపీలో చేరిన తర్వాత కేసు దర్యాప్తు నీరుగారిపోయింది. అదేవిధంగా ” నారద స్టింగ్ ఆపరేషన్” కేసులో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్టీ కి చెందిన మాజీ నాయకులు సువేందు అధికారి, ముకుల్ రాయ్ లపై సిబిఐ, ఈడి లు వెంటాడినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు బిజెపి లో చేరిన తర్వాత ఈ కేసులో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే మహారాష్ట్రకు చెందిన శ్రీ నారాయణ్ రాణేతో సహా అనేక ఉదాహరణలున్నాయి.

2014 నుంచి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం, కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం వంటి సంఘటనలు గణనీయంగా పెరిగాయి. లాలూ ప్రసాద్ యాదవ్ (రాష్ట్రీయ జనతాదళ్), కావచ్చు, సంజయ్ రౌత్ (శివసేన) కావచ్చు, ఇంకా ఆజం ఖాన్ (సమాజ్‌వాదీ పార్టీ), నవాబ్ మాలిక్, శ్రీ అనిల్ దేశ్‌ముఖ్ (ఎన్సీపి), శ్రీ అభిషేక్ బెనర్జీ (టిఎంసి) మొదలైన ప్రముఖ ప్రతి పక్షనేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇదే విధంగా ఎదుర్కొన్నారు. ఈ సంఘటనలను పరిశీలిస్తే.. కేంద్రంలోని పాలకవర్గానికి అనుబంధ విభాగాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయనే అనుమానం కలుగుతున్నది. ఇలాంటి అనేక సందర్భాల్లో నమోదైన కేసులు, అరెస్టులు వాటి సమయ సందర్భాలను పరిశీలిస్తే ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయని, అవి రాజకీయ ప్రేరేపితమైనవని స్పష్టంగా అర్థమౌతున్నది. ప్రతిపక్షాలను అణచివేయడం, అడ్డు తొలగించు కోవడం కోసమే ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలను లక్ష్యంగా చేసుకున్నారని, అందుకోసమే బిజెపి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తున్నదన్న ఆరోపణకు బలం చేకూరుస్తున్నది.
మీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర దర్యాప్తు సంస్థల జాబితా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడి)కి మాత్రమే పరిమితం కాలేదు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా నడుస్తూ, దర్యాప్తు సంస్థలు తమ ప్రాధాన్యతలను మార్చుకున్నాయని స్పష్టమైంది.
ఎస్ బిఐ, ఎల్ఐసి సంస్థలకు కలిగిన నష్టం గురించి అంతర్జాతీయ ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన సంస్థ ఒక నివేదిక ప్రచురించింది. తమ షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 78,000 కోట్లకు పైగా ఒక నిర్దిష్ట సంస్థలో పెట్టుబడిగా పెట్టడం వల్లనే ఎస్ బి ఐ, ఎల్ ఐ సి సంస్థలు నష్టపోయినట్లు ఆ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచినప్పటికీ, సంబంధిత సంస్థల ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ఏజెన్సీలు ఎందుకు ముందుకు రావడం లేదు?

అంతేకాకుండా.. దేశ ఫెడరలిజానికి వ్యతిరేకంగా యుద్ధం చేపట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇంకో వ్యవస్థను ఉసిగొల్పుతున్నట్టు అనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా గవర్నర్ల కార్యాలయాలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ, రాష్ట్రాల పాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. గవర్నర్లు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశపూర్వకంగా అణగదొక్కుతున్నారు. బిజెపియేతర పార్టీలు పాలన సాగిస్తున్న తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలను పెంచే వాల్లుగా, సహకార సమాఖ్య స్ఫూర్తికి ప్రమాదకారులుగా తయారయ్యారు. సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించడంలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందింది. అయినప్పటికీ, రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ రాజ్యాంగ విలువలను పాటిస్తున్నాయి. గవర్నర్ల వ్యవస్థ అనుసరిస్తున్న సమాఖ్య వ్యతిరేక వైఖరి పర్యవసానంగా, నేడు భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర ఏమిటని ప్రశ్నించడం ప్రారంభించారు.
రాజ్యాంగబద్ధమైన గవర్నర్ కార్యాలయాలను, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తూ ఎన్నికల క్రేత్రానికి వెలుపల తలపడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మన దేశ ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించడమే తప్ప మరోటి కాదు. 2014 నుండి ప్రతిపక్షాల పై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తున్న తీరు, వాటి ప్రతిష్ట మసకబారేలా చేసింది. దాంతో పాటు ఆ సంస్థల స్వయంప్రతిపత్తి, నిష్పాక్షికత పై ప్రశ్నలను లేవనెత్తింది. వీటిపై భారత ప్రజలకు నానాటికీ విశ్వాసం సన్నగిల్లుతూనే ఉంది.
మీ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వున్నాసరే, వేరే పార్టీ భావజాలానికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు, మీరు ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని గౌరవించి తీరాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే అత్యున్నతమైనది.

ఇట్లు
కె. చంద్రశేఖర్ రావు (బిఆర్ఎస్) ఫరూక్ అబ్దుల్లా (జెకెఎన్ సి)
మమతా బెనర్జీ (టిఎంసి) శరద్ పవార్ (ఎన్ సిపి)
అరవింద్ కేజ్రివాల్ (ఆప్) ఉద్ధవ్ ఠాక్రే (శివసేన, యుబిటి)
భగవంత్ మాన్ (ఆప్) అఖిలేష్ యాదవ్ (ఎస్ పి)
తేజస్వి యాదవ్ (ఆర్ జెడి)

RELATED ARTICLES

Most Popular

న్యూస్