వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై వెంటనే స్పందించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిపై నిన్నటి తీర్పుపై కూడా స్పందించి ఉంటే బాగుండేదని, ఏమైనా నిద్ర పోయారా అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తామని న్యాయస్థానం ఎప్పుడో చెప్పిందని, ఏ రాష్ట్రానికి అనేది నేడు చెప్పిందని అన్నారు.
వివేకా హత్యకు ముందురోజు వరకూ తమ పార్టీ కడప పార్లమెంట్ అభ్యర్ధి అవినాష్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారని గుర్తు చేశారు. హత్య వెనుక గల కారణమేంటో ఎప్పుడైనా బైటకు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సిఎం జగన్ ఓపెన్ మైండ్ తోనే ఉన్నారన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం తమకు చేతకాదని, దానిలో టిడిపి వారు సిద్ధ హస్తులని అన్నారు. కేసు బదిలీ చేసినంత మాత్రాన తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. నిజం ఏమిటనే తాము కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నామన్నారు. తాము సిబిఐకి ఇచ్చినప్పుడే స్వాగతించామని, చంద్రబాబులాగా సిబిఐకి రాష్ట్రంలో ప్రవేశం లేదని జీవోలు తీసుకురాలేదని విమర్శించారు. ఓటుకు నోటు సమయంలో ‘నీ సిఐడి నీకుంటే, నా సిఐడి మాకుంది’ అంటూ బాబు వ్యాఖ్యలు చేశారని… యంత్రాంగం అంతా తన ఇంట్లో పనిచేసే నౌకర్లు లాగా నాడు మాట్లాడారని దుయ్యబట్టారు.
తెలంగాణలో వైఎస్ షర్మిలను అరెస్ట్ చేయడం బాధాకరమని సజ్జల వ్యాఖ్యానించారు. షర్మిల రాజకీయ నిర్ణయాలపై తాము వ్యాఖ్యలు చేయబోమని… కానీ ఆమె మా నాయకుడి రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి అని అందుకే నేడు జరిగిన ఘటన వ్యక్తిగతంగా బాధ కలిగించిందని వెల్లడించారు.
Also Read : Supreme Court: తెలంగాణకు వివేకా హత్య కేసు