Sunday, November 24, 2024
HomeTrending NewsPawan Kalyan: దానికే కట్టుబడి ఉన్నాం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: దానికే కట్టుబడి ఉన్నాం: పవన్ కళ్యాణ్

వైసీపీ పాలన నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు విముక్తి కలిగించాలన్న తమ అజెండాకు కట్టుబడి ఉన్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ అంశంపైనే బిజెపి కేంద్ర నాయకత్వంతో చర్చించామన్నారు. ఢిల్లీలో బిజెపి జాతీయ నేతలను కలవాలని చాలారోజులుగా అనుకుంటున్నామని, రెండ్రోజులుగా పలువురితో భేటీ అయ్యామని, రాష్ట్రంలో సుస్థిర పాలన అందించే దిశలోనే తమ చర్చలు సాగాయని వివరించారు.  ఈ సాయంత్రం బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాతో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు

రెండ్రోజులుగా తాము జరిపిన చర్చలు రాబోయే రోజుల్లో బలమైన సత్ఫలితాలు ఇస్తాయని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. బిజెపి కూడా ఈ దిశలోనే ఆలోచన చేస్తోందని, అయితే మొదట సంస్థాగతంగా బలోపేతం కావాలన్న ఆలోచనలో ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ఉందని, తాము కూడా క్షేత్ర స్థాయిలో బలపడడానికి ఇప్పటికే చర్యలు మొదలు పెట్టామన్నారు. భవిష్యత్ ప్రణాళికపై స్పష్టత వచ్చిందా అనే ప్రశ్నకు  ‘వచ్చిందని చెబితే వెంటనే చెప్పినట్లు అవుతుంద’ని బదులిచ్చారు. అధికారంలోకి వచ్చేందుకే అడుగులు వేస్తున్నామని, దాన్ని సాధించేందుకు ఏమి చేయాలన్నదానిపైనే చర్చలు జరుపుతున్నామన్నారు. పొత్తులపై ఎలాంటి చర్చలూ జరగలేదని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్