We are committed: పరిపాలనా వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, రాజ్యాంగం ప్రకారం రాజధానిపై శాసనం చేసే అధికారం అసెంబ్లీకి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయినా పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పినా ఇలాంటి తీర్పు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. తమకు, హైకోర్టు – న్యాయవ్యవస్థ పై ఎంతో గౌరవం ఉందని, అదే రీతిలో రాష్ట్ర శాసన సభకున్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశంపై రాష్ర శాసనసభలో జరిగిన చర్చలో జగన్ పాల్గొన్నారు.
“అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా, పరిపాలనా అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకు రావడంతో పాటు రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కూడా కాపాడతాం… వారికి కూడా అండగా నిలుస్తాం. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయం. ఎందుకంటే వికేంద్రీకరణకు అర్ధం అన్ని ప్రాంతాల అభివృద్ధి కాబట్టి… అందరి ఆత్మగౌరవం అందులో ఉంది కాబట్టి… అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గం కాబట్టి… అందరికీ మంచి చేసేందుకు మన ప్రభుత్వం ఉంది కాబట్టి… ఈ చట్ట సభకు ఈ విషయంలో సర్వాధికారాలతో పాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి.. వికేంద్రీకరణ బాటలో సాగడం మినహా మరో మార్గం లేదని సవినయంగా తెలియజేస్తూ… న్యాయవ్యవస్థ మీద తిరుగులేని, ఆచెంచలమైన విశ్వాసాన్ని మరోసారి ప్రకటిస్తూ,…. Decentralization is our policy and decisions on capitals are our right and responsibility’ అని స్పష్టంగా ప్రకటించారు.
జగన్ మాట్లాడుతూ… రాజధాని విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం అసెంబ్లీకి లేదని ఇటీవల రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సమంసజం కాదన్నారు. శాసనసభ ఓ చట్టాన్ని చేయాలా వద్దా అనేది కోర్టులు నిర్ణయించలేవని, హైకోర్టు తీర్పు రాజ్యంగ స్ఫూర్తి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని, ఆ విషయంలో కేంద్రం చేయాల్సింది ఏమీ లేదని అంటూ కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాల్లో అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఉండాలన్న వాదనను కూడా కేంద్రం మరో అఫిడవిట్ లో తోసిపుచ్చిందని గుర్తు చేశారు.
శాసన, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థలు వేటికవే స్వతంత్రమైనవని, శాసన సభ ఓ చట్టాన్ని చేయాలా వద్దా అని కోర్టులు నిర్ణయించలేవన్నారు. ఒక నెలరోజుల్లో రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్న కోర్టు వ్యాఖ్యలు కూడా సాధ్యం కాని రీతిలో ఉన్నాయని,ఆచరణ- అమలు సాధ్యం కాని తీర్పులు ఇవ్వోద్దనే సుప్రీం కోర్టు తీర్పు ఉన్నా దానికి విరుద్ధంగా హైకోర్టు తీర్పులో ఈ విషయాన్ని చెప్పారన్నారు. రాజధాని అభివృద్ధికి, మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి కనీసం 40 ఏళ్ళపాటు పడుతుందని, ఎక్కడ ఏ రాజధాని తీసుకున్నా అవి కాల క్రమంలో అభివృద్ధి చేనినవేనని వివరించారు.
ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడ ఇళ్లు కట్టుకున్నానని, అందుకే ఇక్కడే లెజిస్లేచర్ ఉండాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సభలో కూర్చుని భావోద్వేగంతోనో, ఓట్ల కోసమో నిర్ణయాలు తీసుకోలేమన్నారు. రాజధానిపై చంద్రబాబుకు ఏమాత్రం ప్రేమ లేదని, ఉండి ఉంటే ఏ విజయవాడలోనో, గుంటూరులోనో రాజధాని పెట్టి ఉండేవారన్నారు.
Also Read : చట్ట సభల ఔన్నత్యం నిలబడాలి: ధర్మాన