కీలకమైన పదవులన్నీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వడం సరైనదేనా అని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అగ్నికుల, వెలమ, క్షత్రియ, కాపు శెట్టి బలిజల్లో అర్హులైనవారికి ఎందుకు ఇవ్వలేదని అడిగారు. తనకు అధికారం లేనప్పుడే, ఎమ్మెల్యేగా గెలవకుండానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, జనసేన పోరాటం మొదలు పెట్టినందునే కోనసీమలో రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే అకౌంట్లలో వేశారని, రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశారని గుర్తు చేశారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగిన బహిరంగసభలో పవన్ ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ జాతీయ నాయకులు, అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆయన ఆ రోజుల్లో 56 రోజుల ఆమరణ నిరాహారదీక్ష ద్వారా రాష్ట్రాన్ని సాధించారని పవన్ కొనియాడారు.
కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే వారితో ఒక మాట మాట్లాడి వారికి అర్థమయ్యేలా చెప్పిఉంటే గొడవలు జరిగేవా? అని నిలదీశారు. కావాలనే జగన్ ప్రభుత్వం గొడవలు సృష్టించిందని, ఈ విషయాన్ని నిఘా వర్గాలే తనకు చెప్పయని పవన్ వెల్లడించారు.
“మన కోనసీమలో ఇప్పటికీ త్రాగునీటి సమస్య ఉంది, సరైన వైద్యసేవలు లేవు, మన కోనసీమలో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అవసరం ఉందని, ఈ సమస్యల పరిష్కారం కోసం జనసేన ప్రభుత్వం రావడానికి అండగా ఉండండి” అంటూ విజ్ఞప్తి చేశారు.
జనసేనకు కోనసీమలో బలం ఉండదని అందరూ చెబుతారని, కానీ తనకు మాత్రం భయం వేస్తుందని, ఏ చిన్నపాటి తప్పు జరిగినా ఇక్కడి ప్రజలకు విపరీతమైన కోపం వస్తుందని, ఈ నేలలో పెట్రోలియం ఉన్నందుకేనేమో అంత కోపం వస్తుందని వ్యాఖ్యానించారు. ‘మీలో ఉన్న ప్రేమ అంతకంటే ఎక్కువ’ అని ప్రశంసించారు. కోనసీమను సంపూర్ణంగా అభివృద్ధి చేసే వరకూ తాను విశ్రమించానన్నారు.
ఈ మధ్య జనసేన కథాకళి కార్యక్రమంలో తమ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ‘ఉప్మా సీఎం’ అని పేరు పెట్టారని, అందరూ విడిపోయి ఓట్లు వేయడం వలన జగన్ లాంటి ఉప్మా సీఎం అధికారం లోకి వచ్చాడని అజయ్ చెప్పారని పవన్ ప్రస్తావించారు
కోనసీమ రైతులు ఒక పక్క నష్టపోతుంటే ప్రతీ ఎకరాకు ఒక బస్తా ద్వారంపూడి కుటుంబానికి వెళ్తుందని, కోనసీమ రైతాంగం కన్నీటి మీద ద్వారంపూడి కుటుంబీకులు వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు.