విశాఖ హక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని, పెట్టుబడుల ఉపసంహరణను మొదటినుంచీ వ్యతిరేకిన్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పునరుద్ఘాటించారు. సిఎం జగన్ ఢిల్లీలో పెద్దలను ఎప్పుడు కలిసినా ఈ విషయమై విజ్ఞప్తి చేస్తున్నారని గుర్తు చేశారు. మొన్న కేంద్ర మంత్రి ఒక ప్రకటన ఇవ్వగానే బిఆర్ఎస్, సెలబ్రిటీ పార్టీలు ఇది కేవలం తమ వల్లే అంటూ మాట్లాడాయని అపహాస్యం చేశారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు అంకిత భావం లేదని, రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ది, అంకిత భావం లేదని, వారి పట్ల తమకు సదభిప్రాయం లేదని అందుకే స్టీల్ ప్లాంట్ విషయంలో అక్షిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్ళడం లేదని తేల్చి చెప్పారు.
విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎన్ఐఏ నివేదికను వక్రీకరించి రాయడం దుర్మార్గమని బొత్స వ్యాఖ్యానించారు. దాడి జరిగిన మాట వాస్తవమని, చేసిన వ్యక్తి కూడా దొరికాడని, ఎందుకు చేయాల్సి వచ్చిదనేది విచారణ చేసి బైట పెట్టాలని తాము మొదటి నుంచీ కోరుతున్నామని అన్నారు. జగన్ స్వయంగా ఈ దాడి చేయించుకున్నట్లు అర్ధం వచ్చేలా పత్రికలూ విషం చిమ్మడం దారుణమన్నారు, 2003 లో చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగిందని, అది కూడా స్వార్ధం కోసం, సానుభూతి కోసం అది జరిపించుకున్నాడా అని ప్రశ్నించారు. అసలు ఇలా రాసేవారికి ఇంగిత జ్ఞానం, ఉచ్చనీచాలు ఉన్నాయా అంటూ నిలదీశారు. శ్రీకాకుళంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి డా. సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి ధర్మానలతో కలిసి బొత్స మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఉన్న అలవాట్లే మిగిలిన అందరు నేతలకూ ఉంటాయనుకున్నారా అంటూ బొత్స అసహనం వ్యక్తం చేశారు. జగన్ పై హత్యాయత్నం ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
అదానీకి భావనపాడు పోర్టు అప్పగించేందుకు ప్రయత్నాలు చేసున్నారని, అందుకే పనులు మొదలు పెడుతున్నారంటూ విపక్షాలు చేస్తోన్న విమర్శలను బొత్స తీవ్రంగా ఖండించారు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలని, వారి పాలనా కాలంలో పోర్టు పనులు ఎందుకు మొదలుపెట్టి పూర్తి చేయలేదని నిలదీశారు.