రాబోయే రోజుల్లో భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మన వ్యవసాయ రంగం పనితీరుని అధ్యయనం చేసే పరిస్థితి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలను ఇంకా పటిష్టం చేస్తామని, సాయిల్ టెస్టింగ్ లు చేయించబోతున్నామని, ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ తో పాటు డ్రోన్లు కూడా వినియోగిస్తామని వివరించారు. ఇరిగేషన్‌కు ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్రస్థాయి రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సిఎం జగన్ ప్రసంగించారు.
నాన్నగారు డాక్టర్ వైఎస్సార్ జయంతిని ప్రతి ఏటా రైతు దినోత్సవంగా అన్నదాతకు పాదాభివందనం చేస్తూ జరుపుకుంటున్నామని…. నాన్నగారు గుర్తొచ్చినప్పుడల్లా ఆయన ఏరకంగా రైతుల పట్ల స్పందించాడన్నది గుర్తొస్తుందని జగన్ భావోద్వేగంతో వెల్లడించారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, రైతు పేద కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం గుర్తొస్తుందన్నారు.
రైతు చేస్తున్నది అన్నం పెట్టే వ్యవసాయం తప్ప వ్యాపారం కాదని, ఈ విషయం పాలించే వాళ్లకు అర్థం కావాలన్నారు. రైతును మోసంచేయకూడదని… పాలకుడికి ఒక నిబద్ధత, నైతికత ఉండాలని … ఇవన్నీ ఉన్న వ్యక్తి ఒక వైఎస్సార్ అని జగన్ అన్నారు. అలాంటి లక్షణాలు ఉంటే ఆ గుండెను ఒక జగనన్న అని కూడా అంటారని సగర్వంగా తెలియజేస్తున్నానన్నారు. నిబద్ధత, నైతికత లేకపోతే ఆ గుండెను, మనిషిని ఓ చంద్రబాబు నాయుడు అంటారని ఎద్దేవా చేశారు. వర్షాలు లేని సంవత్సరాల్లో రైతులకు అండగా నిలబడే మనసే లేకపోతే రాబందులకు, నక్కలకు విందు భోజనం దొరుకుతుందని విపక్షాలపై విరుచుకుపడ్డారు.
ప్రతి గ్రామంలో ఎవరికి ఎంత ఇన్సూరెన్స్ వస్తోంది, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరుగుతోందీ లాంటి అన్ని విషయాలపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి సోషల్ ఆడిట్‌లో పేర్లు పెడుతున్నారని, రైతు భరోసా కేంద్రాల్లో అభ్యంతరాలు కూడా తీసుకుంటున్నామని వివరించారు. బీమా పరిహారం ఏ ఒక్క రైతూ నష్టపోకుండా ఇస్తున్న గొప్ప కార్యక్రమం జరుగుతున్నా విపక్షాలు రాజకీయాలు, వక్రీకరణ చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో కరువు కాలంలో కూడా రైతులకు అందాల్సిన బీమా అందకపోతే ఎల్లో మీడియా నోరెత్తలేదని, బాబు వచ్చి రెయిన్ గన్‌తో కరువును పారదోలానని ఫొటోలకు ఫోజులిస్తుంటే కరువు వెళ్లిపోయిందని నిస్సిగ్గుగా కథనాలు రాశారని మండిపడ్డారు. తమ నాలుగేళ్ల పాలనలో రైతన్నలకుమంచి చేసేందుకు అక్షరాలా రూ.1,70,769 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
- పాడి పంట ఉండే నాయకత్వం కావాలా, లేక నక్కలు, తోడేళ్లు ఉండే పాలన కావాలా?
- రైతు రాజ్యాం కావాలా లేక రైతును మోసం చేసే పాలన కావాలా?
- రైతుకు తోడుగా ఉండే ఆర్బీకే వ్యవస్థ కావాలా, గత ప్రభుత్వంలోమాదిరిగా దళారీ వ్యవస్థ కావాలా?
- పేదల ప్రభుత్వం కావాలా? లేక పెత్తందార్ల ప్రభుత్వం కావాలా?
- దేవుడి దయతో వర్షాలు కావాలా? లేక చంద్రబాబు ఐరెన్ లెగ్ కరువు కావాలా?
- మాట తప్పని ప్రభుత్వం కావాలా? వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు పాలన కావాలా?
- అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా డబ్బులు పోయే డీబీటీ ప్రభుత్వం కావాలా? చంద్రబాబు ప్రభుత్వంలో మాదిరిగా రైతుల్ని, పేదల్ని, సామాజిక వర్గాల్ని మోసం చేసి దోచుకోవడం, పంచుకోవడం, తినుకొనే డీపీటీ పద్ధతి కావాలా?
- పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని సుప్రీంకు వెళ్లే పైశాచిక ఆనందం పొందే పెత్తందార్లు కావాలా?
- ఆరోగ్యశ్రీ, 104, 108, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, 100 శాతం ఫీజు రీయింబర్ష్‌మెంట్, వసతి దీవెన అందించే మనందరి ప్రభుత్వం కావాలా?
- పేదలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా టార్చ్ లైట్ వేసి చూసి వెతికినా కనిపించని పెత్తందార్ల ప్రభుత్వం కావాలా?
అనేది ఆలోచించాలని ప్రతి రైతును, అక్కచెల్లెమ్మను, పేద వాడిని, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా నిరుపేద వర్గాలను కోరుతున్నానని జగన్ పేర్కొన్నారు.