పొత్తుల అంశాన్నితేల్చాల్సింది బిజెపి కేంద్ర నాయకత్వమేనని, ఎన్నికల ముందు పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటుందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. విశాఖలో బిజెపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఇతర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లపాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నెలరోజులపాటు ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. సేవ, జబాబుదారీతనం, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, దేశ గౌరవం, మౌలిక సదుపాయాల కల్పన, మహిళలు, రైతుల సాధికారత; ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతో ప్రధాన అంశాలుగా మోడీ పాలన సాగిందన్నారు. ప్రధాని పదవి అనేది ఓ బాధ్యతగా, సేవ గా భావిస్తూ మోడీ పని చేస్తున్నారని సత్యకుమార్ కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి తాము చేసిన మంచి వివరిస్తామని, నెలరోజులపాటు జరిగే కార్యక్రమాలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని సత్య వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం నిధులే ఉన్నాయని కానీ సిఎం జగన్ వాటికి పేర్లు మార్చి ఇస్తూ తమ ఘనతగా చెప్పుకుంటున్నారని, దీనిపై కూడా ప్రజలకు వివరిస్తామని చెప్పారు.