Friday, October 18, 2024
HomeTrending Newsపాజిటివ్ ఓటుతో మేమే వస్తాం: అంబటి

పాజిటివ్ ఓటుతో మేమే వస్తాం: అంబటి

నిన్నటి ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని ఇది తమకు అనుకూలంగా ఉంటుందని, పాజిటివ్ ఓటుతో వైయస్ జగన్ మరోసారి అధికారం చేపడతారని రాష్ట్ర  మంత్రి అంబటి రాంబాబు ధీమా  వ్యక్తం చేశారు.  ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటువేశారని అన్నారు. మహిళల్లో ఈ ప్రభుత్వం పట్ల విశేష స్పందన ఎన్నికల ప్రచారంలో కూడా చూశామన్నారు. పోలైన మొత్తం మహిళా ఓటింగ్ లో 70 శాతం వరకు వైసిపికి పడుతుందని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు.  సీఎం జగన్ మహిళలకు సాధికారత కల్పించారని, వారికి ఆర్థిక స్వావలంబన కలిగించారని,  అన్ని సంక్షేమ పథకాలు వారి పేరు మీదనే అందజేశారని  వివరించారు. సత్తెనపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వంపై పాజిటివ్ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటం చరిత్రలోనే ఓ అరుదైన సంఘటన అని ఆయన అభివర్ణించారు.  ఐదేళ్ల పాలన తర్వాత ప్రభుత్వంపై ఏమాత్రం వ్యతిరేకత లేదని కేవలం సానుకూల వైఖరి ప్రజల్లో కనిపించిందని… జగన్ ను రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న తపన,  తాపత్రయం  కనిపించిందని రాంబాబు చెప్పారు. పెద్ద మెజారిటీతో జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు.

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్,  ఐపీఎస్ అధికారులను… స్థానిక పోలీసులను మార్చారని,  అయినా సరే శాంతిభద్రతలు ఎందుకు కాపాడలేకపోయారని రాంబాబు ప్రశ్నించారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హింస. ప్రజ్వరిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలో హింసను అదుపు చేయడంలో పోలీస్ యంత్రాంగం దారుణంగా విఫలమైందని అంబటి ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులను  అడ్డుకోలేకపోయామని… క్షేత్రస్థాయిలో కొందరు సిఐలు,  ఎస్ఐలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్