Cm Jagan Clarified :
కేంద్రంలో తాము ఏ పార్టీ కూటమిలో లేమని, తమది ప్రజల కూటమి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటులో మనం లేవనెత్తుతున్న ప్రతి అంశం కూడా ప్రజల తరఫునే అడుగుతున్నామని, మనం వేసే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలని ఎంపీలకు సూచించారు. ప్రజలకు మేలు జరిగే ఏ అంశంకోసమైనా మనం ముందడుగు వేయాలని, ఎంపీలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని హితవు పలికారు, సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో సిఎం జగన్ పలు అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
- రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల (55,657 కోట్ల రూపాయలు) ఆమోదానికి కృషిచేయాలి
- జాతీయ ఆహార భద్రతా చట్టం కింద… లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత లేదు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది.
- ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,703 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించాల్సిందిగా వెంటనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.
- రాష్ట్ర విభజన తర్వాత మన విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం వాడుకుంది. రాష్ట్రానికి తెలంగాణ రూ. 6,112 కోట్ల బకాయి పడింది. ఎంపీలు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి.
- రాష్ట్ర విభజన సమయంలో మొత్తంగా రీసోర్స్ గ్యాప్ రూ. 22, 76 కోట్లు అయితే ఇచ్చింది, రూ. 4,117.89 కోట్లు మాత్రమే.
- ఓవర్ బారోయింగ్ పేరుతో రుణాలు కత్తిరించడం అన్నది ఎప్పుడూ లేదు. చంద్రబాబుగారి హయాంలో చేసిన దానికి రుణాల్లో కత్తిరింపులకు దిగడం అన్నది సరికాదు. నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. అంశాన్ని ఉభయ సభల్లో ప్రస్తావించి రాష్ట్రానికి మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- రాష్ట్రంలో ఇటీవల వరదల సందర్భంగా అపార నష్టం ఏర్పడింది. వరద బాధితులను ఆదుకునేందకు తక్షణ హాయంగా రూ.వేయి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి లేఖలు కూడా రాశాం. ఈ అంశాన్ని ప్రస్తావించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.
- 2021 జన గణన సదర్భంగా బీసీ కులాల వారీగా జన గణన చేయాలని కోరాం. దీనికోసం ఒత్తిడి తీసుకు రావాలి. ఈమేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం.
- ఉపాధిహామీ కింద రూ. 4976.51 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.
- విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని పలుమార్లు లేఖలు రాశాం. పెట్టుబడుల ఉపసంహరణకు బదులుగా ప్రత్యామ్నాయాలను కూడా సూచించాం. దీనిపై అసెంబ్లీ కూడా తీర్మానం చేసింది. ఈమేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.
- రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలను తీసుకువస్తున్నాం. ఇంకా 13 కాలేజీలకు అనుమతి రావాల్సి ఉంది. ఈ అంశాన్ని సభలో ప్రస్తావించాలి.
- ఇళ్ల నిర్మాణం వల్ల ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. దీనికోసం కూడా ఎంపీలు కృషిచేయాలి.
- దిశబిల్లు ఆమోదం ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాలి.
- 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేంద్రం నిర్ణయించింది. అదే సమయంలో ఎంఎస్‌పీలకు సంబంధించి కొత్త చట్టం చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల డిమాండ్‌కు మన పార్టీ తరఫున మద్దతు పలకాలి.
అంటూ జగన్ ఎంపీలకు సూచించారు.
Also Read : బాబు సంస్కారానికి నా నమస్కారం : సిఎం