We Are ready: వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పంచాయతీల నిధులు ఆ గ్రామాభివృద్దికే ఖర్చు పెడతామని వెల్లడించారు. మండపేటలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన పవన్ కళ్యాణ్ 60 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికీ లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయన ప్రసంగిస్తూ… తప్పు జరిగితే గొంతెత్తి నిలదీయాలని, ఎంతమందిని జైళ్లలో పెడతారో చూద్దామని పిలుపు ఇచ్చారు. తప్పును నిలదీశే శక్తి లేకపోతే మనుగడ ఉండదని, తప్పులను ఎత్తిచూపే బాధ్యత యువత తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో జనసేనకు ఎలా మద్దతివ్వాలో ఆలోచించాలని, ఎవరికి టికెట్ ఇచ్చినా వారిలో పవన్ ను చూసుకొని ఓటేయ్యాలని కోరారు.
మార్పు అనేది ఉభయ గోదావరి జిల్లాల్లో మొదలు పెడితే అది కడప జిల్లా వరకూ వెళుతుందన్నారు. మార్పు కోసమే జనసేన వచ్చిందన్నారు. ఒక బలమైన ప్రతిపక్షం సమాజానికి ఎంతో అవసరమన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని, రాష్ట్రాన్ని కాపాడే సత్తా జనసేనకే ఉందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుకు వైసీపీ హానికరమని, ఈ పార్టీని ఎలా ఎదుర్కోవాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో తన పర్యటనకు పోలీసు యంత్రాంగం అస్సలు సహకరించలేదని ఆరోపించారు. పోలీసులు వ్యవస్థల కోసం పనిచేయాలని, నాయకులకోసం పనిచేస్తే ప్రజలు ఎదురు తిరుగుతారని హెచ్చరించారు.
కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతి కుటుంబానికీ 7లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించాలని పవన్ డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ఇష్టపడడం లేదని విమర్శించారు.
Also Read : ప్రజలను పల్లకీ ఎక్కిస్తాం: పవన్ కళ్యాణ్