Routine Process: పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చడం అనేది నిరంతర ప్రకియ అని… తన కర్నూల్ టూర్ వల్లే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవుల్లో మార్పులు చేసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. గో బ్యాక్ బాబు అంటూ ప్రజలు నినాదాలు ఇస్తున్నారని… దీనిపై ఆవేదన, ఉక్రోషంతో బాబు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే అసెంబ్లీకి వెళతా లేకపోతే ఇంటికి వెళ్తా అని చెప్పిన వ్యక్తి.. ఆ మర్నాడే ప్రజలను గుడ్డలూడదీసి కొడతా అంటూ దుర్భాషలాడారని అందుకే టిడిపిని బూతుల పార్టీ అని అంటున్నామని అన్నారు. సచివాలయంలో మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడారు.
గతంలో ఎన్నడూ లేని పథకాలు సిఎం జగన్ ప్రవేశ పెట్టి, అన్ని వర్గాల వారికీ సంక్షేమం అందిస్తున్నారని అన్నారు. పార్టీలు చూడకుండా అందరికీ పథకాలు అందిస్తున్నామని, గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి వెళుతుంటే టిడిపి వారు కూడా తమను ఆదరిస్తున్నారని, తమ సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు.
రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజనూ సేకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. వర్షాల వల్ల ధాన్యం పెద్దగా తడవలేదని, కొద్దిపాటిగా తడిసినదాన్ని కూడా కొంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వమే ధాన్యం సేకరిస్తోందని, ఆ తర్వాత మిల్లర్ల వద్దకు పంపి ఆడిస్తున్నామని తెలిపారు. రైతుకు- మిల్లర్లకు మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదని సిఎం జగన్ తేల్చి చెప్పారన్నారు. రైతులకు చెల్లింపులు కూడా త్వరగా చేస్తున్నామని, నిన్న ఉదయం సేకరించిన దానికి నిధులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నానికే 160 కోట్ల రూపాయలు వెంటనే వారి ఖతాల్లో వేశామన్నారు. నూకలు, రంగుమారిన ధ్యానం అంటూ గతంలో 150-200 రూపాయల వరకూ తగ్గించేవారని కానీ తమ ప్రభుత్వం ఏమాత్రం కొత్త లేకుండా గిట్టుబాటు ధర పూర్తిగా చేల్లిస్తోందని, దీనితో రైతులే ఆశ్చర్యానికి గురవుతున్నారని మంత్రి కారుమూరి వివరించారు.
Also Read : పులివెందుల కూడా మాదే: చంద్రబాబు