అంగన్‌వాడీల మిగిలిన డిమాండ్లపట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉబందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆందోళన సమయంలో కూడా అనేక డిమాండ్లను అంగీకరించామని, వాటిని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు కూడా జారీచేశామని ఆయన వెల్లడించారు.
రాజకీయ శక్తుల చేతుల్లో చిక్కుకోవద్దని, ఈ అందోళన వేదికగా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ శక్తులు యత్నిస్తున్నాయని… అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వొద్దని అంగన్‌వాడీలకు బొత్స సూచించారు.
బాలింతలు, శిశువులకు ఇబ్బందిరాకుండా వెంటనే మీ సేవలు వారికి అందించాల్సిన అవసరం ఉందని, విధులకు హాజరుకాని మిగిలిన వారు కూడా వెంటనే హాజరుకావాలని కోరారు. వారి సేవలు చాలా అవసరమని భావించి ఈ విజ్ఞప్తిచేస్తున్నామంటూ బొత్స ఓ ప్రకటన విడుదల చేశారు.
పలు జిల్లాల్లో అంగన్‌వాడీలు విధుల్లో హాజరవుతున్నారని, రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధుల్లో చేరారని, మిగిలిన జిల్లాల్లోకూడా అంగన్‌వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని, జాయిన్ అవుతున్నవారందరికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. మిగిలిపోయిన వారు కూడా వెంటనే విధులకు హాజరుకావాలని, ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే జీతాలు పెంచామని, ఎవరూ అడగకపోయినా అనేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించామని బొత్స గుర్తు చేశారు.