We will fight: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని, లేకపోతే క్షేత్ర స్థాయిలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. విజయవాడ పార్లమెంట్ జిల్లా పరిధిలో ఏర్పాటుచేసిన ధర్నాలో సోము పాల్గొన్నారు.
జగన్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతూ వారి జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోందని, ఈ పెంపుతో రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న సిఎం జగన్ తక్షణమే తన నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, సక్రమంగా నిర్వహించడంలో విఫలమైందని సోము ఆరోపించారు. ఈ పెంపు వైసీపీ పాలనకు నిదర్శనమన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలను వీర్రాజు ఖండించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై 10 రూపాయల మేర తగ్గించిందని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఈ స్థాయి భారం మోపిందని సోము విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఢిల్లీలో ధర్నాలు చేయాలని సూచించారు.