Sunday, September 8, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏది ప్రామాణికం?

ఏది ప్రామాణికం?

Language-Standards: ఏ మీడియాకయినా భాష చాలా ముఖ్యం. అయితే ఆయా మాధ్యమాలనుబట్టి భాష స్థాయి, శైలి మారాలి.
ఈ మధ్య ఒక టీ వీ ఛానెల్లో యాంకర్లు, డెస్కు జర్నలిస్టులకు ఓరియెంటేషన్ క్లాసులు చెప్పాల్సిందిగా నన్ను పిలిచారు. అందులో భాగంగా ఒక జర్నలిస్టు మిత్రుడు చాలా అవసరమయిన ప్రశ్న అడిగాడు.

“టీ వీ మీడియాకు భాషతో పనేముంది? అని అంటున్నారు…వీడియో బాగుందా? అందులో ఏముంది ? అన్నది చూసి రాయడం తప్ప ప్రింట్ మీడియావారిలాగా టి వీ జర్నలిస్టులు భాషమీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన పనిలేదు కదా?” అన్నది అతడి ప్రశ్న. అది క్లాసు కాబట్టి చాలా వివరణ, ఉదాహరణలు ఇచ్చాను.

టీ వీ మీడియా భాషమీద చాలా చర్చ జరగాల్సి ఉంది. ప్రింట్, టి వీ మీడియాలో సుదీర్ఘ కాలం పనిచేసిన తోట భావనారాయణ “టెలివిజన్ జర్నలిజం” పేరిట సమగ్రమయిన పుస్తకం రాశారు. దూరదర్శన్ టీ వీ తొలిరోజుల నుండి, కేబుల్ టి వీ, శాటిలైట్ టి వీ , టీ వీ న్యూస్ ఛానెల్స్ దాకా అన్నిటినీ ఒక పరిణామక్రమంలో వివరించారు. సాంకేతిక అంశాలను కూడా తేలికగా అర్థమయ్యేలా చెప్పారు. ఒక రకంగా టి వీ జర్నలిస్టులకు టెక్స్ట్ బుక్ ఇది. తెలుగులో ప్రింట్ మీడియా మీద ఉన్నన్ని జర్నలిజం పాఠాలు, పుస్తకాలు, విశ్లేషణలు టి వీ మీడియామీద లేకపోవడం ఒక లోపం. ఆయా మీడియా సంస్థలు అంతర్గతంగా నిర్వహించుకునే జర్నలిజం శిక్షణ స్కూళ్లలో కొంత ప్రింట్, కొంత టీ వీ , మరికొంత డిజిటల్ పాఠాలను రూపొందించుకున్నాయి. కానీ- ఆ పాఠాలు పబ్లిక్ డొమైన్లో ఉండవు.

ఇంగ్లీషు మీడియం, అందునా భాషకు సంబంధంలేని వేరే సబ్జెక్ట్ డిగ్రీలు చదివిన పిల్లలు ఈమధ్య జర్నలిజంలోకి ఎక్కువగా వస్తున్నారు. రావడంలో తప్పులేదు. సరిగ్గా కర్త, కర్మ, క్రియ అన్వయంతో తెలుగులోనే వీరిచేత ఒక వాక్యం రాయించడం కష్టంగా ఉంది. అలాంటిది ప్రింట్, టీ వీ, డిజిటల్ మీడియాలకు వీరినే తీర్చి దిద్ది పంపుతున్నవారి కృషిని అభినందించాలి.

చాలామందికి టీ వీ మీడియాకు భాషతో పనేముంది? అన్న అభిప్రాయం ఉన్నమాట నిజం. మన తెలుగు టీ వీ మీడియా ప్రింటుకు జెరాక్స్ తప్ప, టీ వీ మీడియా సొంత గొంతుకగా ఎదగలేదు. కొంతవరకు టీ వీ9 ప్రింట్ ప్రభావం లేకుండా ఎదగడానికి ప్రయత్నించింది.

హెడ్డింగులు, స్క్రోల్, బ్రేకింగ్ ప్లేట్స్ ఇలా చాలాసార్లు టీ వీ తెరలో న్యూస్ పేపర్ చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది తప్ప వీడియోవార్త చూస్తున్న ఫీలింగ్ రాదు. ఈ విషయంలో బి బి సి ప్రామాణికం. వార్త వీడియో లేకపోయినా, దొరక్కపోయినా తెలుగు టీ వీ మీడియా పెద్దగా బాధపడదు. గంటలకొద్దీ టెక్స్ట్ ప్లేట్స్, బాక్సులు, నంబర్లు వేసి నడుపుతూనే ఉంటుంది.

ప్రింట్ మీడియా వారు టీ వీ లు కూడా పెట్టడం, ఆ వార్తలే టి వీకి కూడా వార్తలు కావడం లేదా వాటినే టీ వీ వార్తలుగా అనుకోవడం, ప్రింటు జర్నలిస్టులు టీ వీ జర్నలిజంలోకి వచ్చినా ప్రింట్ ప్రభావం నుండి బయటపడకపోవడం, ఎంత గొప్ప దృశ్యమయినా అక్షరాలా అక్షరాలతో చెప్పకపోతే ప్రేక్షకుడికి ఎక్కదని, అర్థం కాదని ఒక అభిప్రాయం పాతుకుపోవడం ఇలా దీనికి సవాలక్ష కారణాలు. తెలుగు న్యూస్ ఛానెల్స్ అసలు సౌండ్ లేకుండా ఒట్టి అక్షరాలు చదువుతూ వార్త ఏమిటో తెలుసుకోవచ్చు.

ఇప్పుడు మన అసలు విషయం టీ వీ మీడియం- భాషలోకి వద్దాం. ఖచ్చితంగా టీ వీ మీడియాకు మంచి భాష అవసరం. అయితే అది పత్రికల ప్రామాణిక రాసే భాష కాకుండా, ప్రామాణిక మాట్లాడే భాష అయి ఉండాలి. ఈ మాట్లాడే భాష దగ్గరే వస్తోంది చిక్కు. అసలు మనకు ఫార్మల్ గా మాట్లాడాలనగానే పాతరాతియుగం రాసే భాషే వస్తుంది కానీ, సహజంగా మాట్లాడేవారు చాలా తక్కువ. పేర్కొన్నారు; పునరుద్ఘాటించారు, భావించారు . . .లాంటి రాత పడికట్టుపదాలు మాట్లాడేమాటల్లో కూడా ఉపయోగిస్తున్నాం. చివరికి జర్నలిస్టులే కాకుండా టీ వీ డిబేట్లలో మాట్లాడే మామూలువారుకూడా ఇదెప్పటికి పూర్తవుతుందని నేను ప్రశ్నిస్తున్నాను– అంటాడు. నిజానికి ఇదెప్పటికి పూర్తవుతుంది? అన్నదే ప్రశ్న. అది పొరపాటున మనమెక్కడ సమాధానంగా అనుకుంటామో అని ఆయనే ప్రశ్నించి, నేను ప్రశ్నిస్తున్నాను అని చెప్పుకుంటాడు. ఇది మంచి పధ్ధతి కాదని నేను భావిస్తున్నాను- అంటాడు. ఇది మంచి పధ్ధతి కాదు- అన్నది అతడి భావన. అలా భావిస్తున్నట్లు మనం గ్రహించాలి. కానీ అతడే భావించి, భావింప సకల భావనలకు అతడే ఆద్యుడని మనం భావించేలా చేస్తాడు.

ఇదంతా ప్రింట్ మీడియా ప్రభావం. రాసినది చదివే పాఠకుడికి సరిగ్గా అర్థం కావడానికి కర్త, కర్మ, క్రియ అన్వయం దెబ్బతినకుండా ప్రామాణికమయిన భాషతో రాయాలని పత్రికాభాషలో నియమం. కొన్ని పారిభాషిక పదాలు, కొన్ని పడిపట్టు పదాలు తప్పవు. అవన్నీ అక్షరాలా టీ వీ మీడియా భాషలోకి కూడా దిగిపోయాయి.

టీ వీ మీడియాలో ఒక విమానం వార్త ఉందనుకుందాం. దాని టేక్ ఆఫ్, ల్యాండింగ్ సౌండ్ కూడా వార్తలో ఉపయోగించాలి. ఒక రైలు వార్త అయితే పట్టాల మీద రైలు వెళ్లే వినసొంపయిన సౌండును వాడుకోవాలి. ఒక పురి విప్పి ఆడే నెమలి వీడియోకు ఎన్ని పదాల స్క్రిప్ట్ రాస్తే మనం న్యాయం చేయగలం? సింపుల్ గా ఆ వీడియోకు ఒక అందమయిన సంగీతం వేసి నెమలి వీడియోను అలా ప్లే చేస్తే చాలు. ఒక నయాగరా హోరుకు ఎన్ని పదాలు పేర్చగలం? పక్షుల కిలకిలా రావాలను ఎంతగా భాషలోకి అనువదించగలం?

ఒక్కో మాధ్యమానికి కొన్ని అనుకూలతలు, కొన్ని పరిమితులు తప్పకుండా ఉంటాయి. అలాగే దృశ్య ప్రధానమయిన టీ వీ మీడియాకు వాడాల్సిన భాష విషయంలో కొన్ని పరిమితులున్నాయి. టీ వీ మీడియా భాష ఎదుటివ్యక్తితో మాట్లాడుతున్నట్లు ఉండాలి. భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ తెలుగులో జర్నలిజం పాఠాలను చాలా ప్రామాణికంగా రూపొందించారు. అత్యంత సరళంగా రాయడం కష్టం; అత్యంత కష్టంగా రాయడం చాలా సులభం అని ఆయన తరచుగా చెప్పేవారు.

తెలుగు టీ వీ మీడియాలో మనసుకు హత్తుకునే, మెదడులో ఆలోచనలు రేకెత్తించే సరళమయిన నుడికారపు తెలుగు ఎంత అవసరమో అంత ఖచ్చితంగా రాసే జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. కానీ- తెలుగు టీ వీ మీడియా రచనా విధానమే మొదటినుండి ప్రింట్ అడుగుజాడల్లో ఉండిపోయింది.


నానా చెత్త వస్తున్నా సోషల్ మీడియా వేదికల్లో ఒక్కోసారి పులకించిపోవాల్సిన తెలుగు దొరుకుతోంది. అసలు జర్నలిజానికి సంబంధమేలేని ఏవేవో వృత్తులవారు మంచి తెలుగు ఏ సోషల్ మీడియాకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుని వాడుతున్నారు. ఒక్కోసారి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సోషల్ మీడియా అనామక రచయితలు సవాలు కూడా విసురుతున్నారు.

కొన్ని లక్షల, కోట్ల మందిని ప్రభావితం చేసే టీ వీ మీడియా భాష విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ప్రేక్షకులకు మంచిది. మాట్లాడే భాషకు మంచిది. టీ వీ మీడియా మనుగడకు మరీ మంచిది.

అనేక భాషల్లో పండితుడు, సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు అన్నమయ్య సాహిత్యం మీద అనేక వ్యాసాలు రాశారు. అవి ఒక్కొక్కటి ఒక పరిశోధన గ్రంథంతో సమానం. వాటిల్లో ఒకచోట ఆయనన్న మాట-
ప్రబంధ కావ్యాలు, సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదాలు, పద్యాలు రాజ్యమేలే రోజుల్లో, పద్యం తప్ప ఏదీ రచన కాదని రాజులు శాసించిన కాలంలో అన్నమయ్య జానపద శైలి పద కవితలను ఎందుకు పట్టుకున్నాడు? అన్నది లోతుగా ఆలోచించాల్సిన విషయం. పన్నెండో శతాబ్దంలో మరాఠీలో మొదలై తరువాత దేశమంతా విస్తరించిన భజన సంప్రదాయం సామాన్యజనానికి చేరువయ్యింది. విఠలా విఠలా! అన్న నామగానం దేశాన్ని ఊపేసింది. కన్నడలో దాస సాహిత్యం పురుడు పోసుకోవడానికి కూడా మరాఠీ భజనలే కారణం. దీన్ని గమనించిన అన్నమయ్య సామాన్యులకు అర్ధమయ్యే భాషలో పద కవితలకు తెలుగులో శ్రీకారం చుట్టాడు. సకల వేద, పురాణ, మంత్ర సారాన్ని ఒక పల్లవి, మూడు చరణాల్లో పల్లెల్లో చదువులేనివారు మాట్లాడుకునే అత్యంత సహజమయిన, అందమయిన మాండలిక తెలుగులో చెప్పాడు. అందరిలా అన్నమయ్య కూడా పది పద్యకావ్య ప్రబంధాలు రాసి ఉంటే…తెలుగు జాతికి, తెలుగు భాషకు ఏమి మేలు జరిగి ఉండేదో కానీ…అలా కాకుండా జనం భాషలో పద కవితలు రాసి…పాడి…ప్రచారం చేయడం వల్ల తెలుగు భాషకు మహోపకారం జరిగింది.  ఒక్క అన్నమయ్య వల్ల జనం భాష మంత్రమయమయ్యింది. మొత్తంగా తెలుగు భాషకు ఆయుస్సు పెరిగింది”.

ఎదురుగా ఉన్న మనిషితో-
మీరేమంటారని నేను ప్రశిస్తున్నానని…
నేను భావిస్తున్నట్లు మీరు గ్రహించాలని…
నేను కోరుకుంటూ…
పునరుద్ఘాటిస్తున్నాని…
తెలియజేసుకుంటూ…
ఆవిధంగా ముందుకుపోదామని అనుకుంటున్నట్లు మాట్లాడే భాష ఏదయితే ఉందో! ఆ ద్రావిడ ప్రాణాయామ భాషలో చుట్టు తిప్పి…నొక్కి…కుక్కి…వక్కాణిద్దామా?
లేక అత్యంత సరళంగా, సహజంగా, అందంగా, అరటి పండు ఒలిచి పెట్టినట్లు తేలిగ్గా చెబుదామా?
అన్నది మనమే తేల్చుకోవాలి.

ఈ వ్యాసానికి ఆధారం:-
1. టెలివిజన్ జర్నలిజం- తోట భావనారాయణ
2. మన భాష- డి. చంద్రశేఖర రెడ్డి
3. తెలుగు టీ వీ జర్నలిజం తీరు తెన్నులు- నాగసూరి వేణుగోపాల్
4. పదకవితా పితామహుడు అన్నమయ్య – త్రిపుటి – పుట్టపర్తి నారాయణాచార్యులు
5. మాటల వాడుక -వాడుక మాటలు; మంచి జర్నలిస్టు కావాలంటే – బూదరాజు రాధాకృష్ణ

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్