We are Strong: భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో 404 సీట్లు గెల్చుకుంటుందని ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ పాలనపై దేశ ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, కార్యకర్తలుగా మావంతు బాధ్యతగా ఈ ఎనిమిదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని వెల్లడించారు. విశాఖ పార్లమెంట్ జిల్లా కార్యాలయంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు.
మోడీ విజయాలపై ఓ పెద్ద పుస్తకం ప్రచిరించినా సరిపోదని, కానీ ముఖ్యమైన అంశాలను పొందుపరుస్తూ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందిస్తున్నామని, వారికి తమ పాలన గురించి చెబుతున్నామన్నారు. మొన్న 1వ తేదీ నుంచి 15వరకూ 15 రోజులపాటు గృహ సంపర్క్ పేరిట ప్రత్యేక కార్యక్రమం ద్వారా వివరిస్తున్నామన్నారు. ఆర్టికల్ 370 రద్దు , న్యాయ సమ్మతంగా కోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం, కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో దేశంలోని 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 24 నెలలపాటు ఉచితంగా బియ్యం పంపిణీ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, లాంటివి అతి ముఖ్యమైనవవని వివరించారు. తమ అభివృద్ధి కార్యక్రమాలతోనే మెజార్టీ రాష్ట్రాల్లో తాము విజయం సాధిస్తున్నామని, కేవలం నినాదాలతోనే కాదని జీవీఎల్ స్పష్టం చేశారు.
దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వని నిధులు ఏపీకి ఇచ్చామని, 20 లక్షల ఇళ్లు కేటాయించామని చెప్పారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనా కేంద్రం ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు 8.16 లక్షల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.
Also Read : నిధులు మావి- ప్రచారం మీదా?: జీవీఎల్