వ్యవస్థలను కించపరిచి దానిలో పనిచేస్తున్నవారి మనోభావాలను కించ పరిచేలా ఎవరు మాట్లాడినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ను నియమించామని. ఈ ఇళ్ళలో నివసించే వారంతా దాదాపు బంధువులే అయి ఉంటారని, ఆ ఇళ్ళ నుంచే ఒకరిని ఎంపిక చేశామని, అలాంటి వారిని పట్టుకొని ఆడ పిల్లలను ఎత్తుకు పోతున్నారంటూ మాట్లాడడం ఏమేరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల తాలూకు ఆర్ధిక పరిస్థితులు తెలుసుకొని, వారిలో ఎవరికి సంక్షేమ పథకాలు అవసరమో నిర్ణయించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి అన్నారు. ఈ విధానం ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదని అన్నారు. మధ్య దళారీలు లేకుండా అర్హులైన అందరికీ సంక్షేమం అందించడం కోసమే ఈ వాలంటీర్ల వ్యవస్థ పెట్టుకున్నామని, ఇది తమ పార్టీ విధానమని పేర్కొన్నారు.
కేంద్ర పెద్దలతో మాకు మంచి సంబంధాలున్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కూడా బొత్స స్పందించారు. ఆయన ఎవరిని బెదిరిస్తున్నారని, కావాలంటే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చని, ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఏ సందర్భంలో డేటా దుర్వినియోగం అయ్యిందో చెప్పాలని అడిగారు. ఇది పూర్తిగా రాజ్యంగబద్దంగా, చట్టబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థ అని, వీరు ప్రజలతో మమేకమైతే అది తమకు ఇబ్బంది అని భావించే విమర్శలు చేస్తున్నారని బొత్స అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థ కాబట్టి వాలంటీర్లకు బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని తేల్చి చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అయినప్పుడు.. ఒక ఎమ్మార్వోనో, ఒక పోలీసు అధికారో తప్పు చేస్తే ప్రభుత్వానిది బాధ్యత అయినప్పుడు వాలంటీర్ల వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ బాధ్యత తామదేనని వివరణ ఇచ్చారు. ఎవరో రోడ్డుపై మాట్లాడే అల్పం మాటలకు తాము జవాబు చెప్పబోమని ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ మాటలు మీడియాకే కామెడీ అయినప్పుడు తమకు ఎందుకు కాదని ఎదురు ప్రశ్నించారు.