నడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్ళే భక్తులకు కర్రల పంపిణీపై వస్తున్న విమర్శలను టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పు బట్టారు. చిరుతల నుంచి రక్షణకు కర్రలు మాత్రమే ఏకైక మార్గమని తాము ఎన్నడూ చెప్పలేదని, ఇదో చిన్న ఉపశమనం మాత్రమేనని స్పష్టం చేశారు. కర్రతో పాటుగా రక్షణ సిబ్బందిని పంపుతున్నామని, గుంపులు గుంపులుగా భక్తులను కొండపైకి అను అతిస్తున్నామని వివరించారు.
శాస్త్రీయ అధ్యయనం తర్వాతే కర్ర పంపిణీ నిర్ణయం తీసుకున్నామని, కర్ర మనిషి కంటే పొడుగు గా ఉంటుంది కాబట్టి, చిరుతలు తమ కంటే ఎత్తుగా ఉండే వ్యక్తులు, వస్తువుల జోలికి అంత త్వరగా రావు కాబట్టి దాన్నొక ప్రత్యామ్నాయంగా భావించామని వివరణ ఇచ్చారు. కానీ కొందరు దీనిపై అసత్య ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని భూమన అసహనం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని భూమన తెలిపారు.
చిరుతలు పట్టుకోవడంలో తాము చిత్తశుద్ధిగా ఉన్నామని, అందుకే మూడ్రోజుల్లో రెండు చిరుతలను పట్టుకోగాలిగామని వెల్లడించారు. మిగిలిన చిరుతలను కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. భక్తుల శ్రేయస్సు తమకు అతి ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు.