Vishakha Industrial Hub : పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. అపార సహజ వనరులు, సకల సదుపాయాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వరుస కడతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సుపరిపాలన ఏపీకి అతిపెద్ద వనరుగా మంత్రి పేర్కొన్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అందించే నిర్ణయం ఓ అద్భుతమైన చర్యగా అమర్ నాథ్ అభివర్ణించారు. విశాఖ నగరాన్ని హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రవాసినైన తాను పరిశ్రమల మంత్రినవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మంగళగిరిలో ఉన్న ఏపీఐఐసీ కార్యాలయాన్ని అమర్ నాథ్ సందర్శించారు. సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తన కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విశాఖను పరిపాలన రాజధానిగానే కాకుండా పారిశ్రామిక నిలయంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి అమర్ నాథ్ కు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి శుభాంక్షలు తెలియజేశారు. ఎండీ సుబ్రమణ్యం జవ్వాది మంత్రికి శాలువాతో సత్కరించారు. ఏపీఐఐసీ ఉన్నతాధికారులు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్, సీజీఎంలు మంత్రిని కలిసి అభినందించారు. అనంతరం మంత్రి అమర్ నాథ్ ఉద్యోగులందరినీ పలకరిస్తూ కార్యాలయం మొత్తం కలియతిరిగారు. 11వ అంతస్తులో ఉన్న ఏపీఐఐసీ ఛైర్మన్, ఎండీల ఛాంబర్లను పరిశీలించారు. 12వ అంతస్తులో ఇటీవల ఇస్కాన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాంటీన్ ను పరిశీలించి అక్కడే ఎండీ, ఈడీ. ఇతర ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు. అనంతరం బిల్లును తానే చెల్లించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఉద్యోగుల ఆరోగ్యం, సౌకర్యం కోసం తక్కువ ధరలకే పౌష్ఠికాహారం అందిస్తుండడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే వారం నుంచి ఉద్యోగులతో సమీక్షలు నిర్వహిస్తానని వెల్లడించారు.
Also Read : గౌతమ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తా