బండి సంజయ్ జీ… మీరు ఒంటరి కాదు… మీకు అండగా దేశంలోని లక్షలాది మంది కమలం కార్యకర్తలు మీ వెంట ఉన్నారని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధాని మోదీజీ సహా జాతీయ నాయకత్వం అంతా మీ వెంట ఉందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో సంజయ్ బాధిత పక్షాలకు తోడుగా ఉండి ప్రభుత్వ నియంతృత్వాన్నిఎండగట్టారని శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు. హుజురాబాద్ లో తెరాస ఓడిపోయాక కెసిఆర్ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వ నిరంకుశ విధానాలను అడ్డుకునేది కేవలం బిజెపి మాత్రమేనని శివరాజ్ సింగ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కెసిఆర్ కుటుంబంలోనే పదవులు దక్కాయని విమర్శించారు. పంజాబ్ పర్యటనలో ప్రధాని వెంట ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర డిజిపి లేకపోవటం దేనికి నిదర్శనం అన్నారు. నిరుద్యోగులకు భత్యం, దళితులకు మూడు ఎకరాల భూమి, కేజీ to పిజి ఉచిత విద్య హామీలు ఇచ్చిన కెసిఆర్ వాటిని నేరవేర్చటంలో విఫలమయ్యారని ఆరోపించారు.
బండి సంజయ్ అరెస్టుకి నిరసనగా, 317 జీవో కు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయం ముందు ఈ రోజు ఏర్పాటు చేసిన సభలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బిజెపి OBC మోర్చ జాతీయ అధ్యక్షులు కే లక్ష్మణ్, బీజేపి జాతియ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజాసింగ్ , ఈటెల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు శాలువా కప్పి ఆశీస్సులు తీసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. బిజెపి నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యోగుల పట్ల, విపక్ష పార్టీల పట్ల అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టారు.
బండి సంజయ్ – బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
కేంద్రం రైతులకు అండగా నిలుస్తూ అండగా పార్లమెంట్ లో వాస్తవాలు చెబితే… ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని సీఎం 317 జీవో పేరుతో సమస్యను దారి మళ్లించిండు. 317 జీవో పేరుతో ఉద్యోగుల, ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుండు. కోవిడ్ నిబంధనలు టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు వర్తించవా? రైతు సంబరాల పేరుతో ఊరూరా ర్యాలీలు తీస్తుంటే టీఆర్ఎస్ నాయకులను ఎందుకు అరెస్టు చేస్తలేరు? దీనికి కారణమైన ఈ ముఖ్యమంత్రిని కూడా ఎందుకు అరెస్టు చేయడం లేదు? యాసంగి పేరుతో రైతులను అరిగోస పెట్టిన ఈ సీఎం ఏ ముఖం పెట్టుకుని రైతు సంబరాలు జరుపుతున్నరు? పోలీసుల ప్రొటక్షన్ తో సంబురాలు చేసుకునే దుస్థితి టీఆర్ఎస్ నేతలది. బండి సంజయ్ తన కార్యాలయంలో ప్రజాస్వామ్య బద్దంగా ‘జాగరణ’ చేస్తే గ్యాస్ కట్టర్లు పెట్టి, రాడ్లతో గేట్లు బద్దలు కొట్టి అరెస్టు చేయిస్తవ్? నీకు సిగ్గు లేదా సీఎం? బీజేపీని చూస్తే కేసీఆర్ కు భయం పట్టుకుంది. అక్కసుతో బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేసిండ్రు. అక్రమంగా అరెస్టు చేస్తే ఊరుకునేది లేదని మేం వెంట మేమున్నామని జేపీ నడ్డా సహా జాతీయ నాయకత్వం మాకు అండగా నిలిచింది. సోషల్ మీడియా వాళ్లపైనా కేసులు పెట్టిండు. కేసీఆర్… ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కు తగ్గేది లేదు. కేసీఆర్.. నిన్ను, నీ పార్టీని తరిమి తరిమి కొట్టేదాకా విశ్రమించేది లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా నిద్రపోం. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ ఆగడాలను ఎండగట్టేందుకు సమైక్య ఉద్యమాలు చేసేందుకు సిద్దంగా ఉన్నాం.
లక్ష్మణ్, OBC మోర్చ జాతీయ అధ్యక్షులు
ధర్మ యుద్దంలో న్యాయం గెలిచింది. చెంప పెట్టులాంటి తీర్పు హైకోర్టు ఇఛ్చింది. మీరు ఇచ్చిన ఉత్తర్వులు తప్పని తేల్చి చెబితే ఈ రోజు బండి సంజయ్ జైలు నుండి బయటకు వచ్చారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల పక్షాన 317 జీవోను సవరించేదాకా ప్రజా క్షేత్రంలో పోరాటం కొనసాగించి తీరుతాం. తెలంగాణలో ప్రజలంతా బీజేపీకి అండగా ఉండాలని కోరుకుంటున్నారు. న్యాయం జరిగే వరకు తుది వరకు కొట్లాడతాం. తెలంగాణలో కుటుంబ-అవినీతి-నియంత పాలనను పారద్రోలే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉంటామని చెప్పేందుకే ఈ సభ. అరచేతితో సూర్యుడిని ఆపలేరు.. మీ అరెస్టులు, లాఠీ ఛార్జీలతో బీజేపీ కార్యకర్తలు అదిరేది లేదు. బెదిరేది లేదు. బండి సంజయ్ నాయకత్వం తెలంగాణ శాఖ చేపడుతున్న పోరాటానికి జాతీయ నాయకత్వం పూర్తిగా అండగా ఉంది.
టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిన తీరుపై జేపీ నడ్డా ఖండించడమే కాకుండా నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, చత్తీస్ ఘడ్ మాజీ డాక్టర్ రమణ సింగ్ సైతం కరీంనగర్ వెళ్లి బండి సంజయ్ తోపాటు బీజేపీ కార్యకర్తలను కలిసి భరోసా కల్పించారు. ఎల్లుండి అసోం సీఎం హేమంత్ బిశ్వా శర్మ రాబోతున్నారు. ప్రభుత్వం దిగొచ్చి 317 జీవోను సవరించేదాకా పోరాడి తీరుతాం. ఈనెల 11న మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ రాష్ట్రానికి రాబోతున్నరు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు జాతీయ నాయకత్వం రాబోతోంది. ప్రజలకు అండగా ఉండేందుకు మేం చేసే పోరాటాల్లో పాల్గనబోతోంది. మంత్రి కేటీఆర్ ప్రధానిపైనా, జేపీ నడ్డాపై వాడిన భాష సభ్య సమాజం తల దించుకునేలా ఉంది. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక 45 వేల కోట్ల ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పంజాబ్ కు వెళితే ప్రధానిపై కేటీఆర్ చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయం చేయడం సిగ్గు చేటు.
రాజాసింగ్ ..ఎమ్మెల్యే
బండి సంజయ్ కి జైలు కొత్త కాదని, బీజేపి కార్యకర్తలకు భయం అంటే తెలియదని ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. సిఎం కేసిఆర్ 8 వ నిజాం రాజుగా అవతరించాడని విమర్శించారు. బండి సంజయ్ వ్యక్తి కాదు ..శక్తి అన్న రాజసింగ్ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే సిఎం కెసిఆర్ ఉద్యోగుల బదిలీలు చేపట్టారని ఆరోపించారు.
డీకే అరుణ .. బీజేపి జాతియ ఉపాధ్యక్షురాలు
వరి ధాన్యం విషయంలో రైతులను టిఆర్ఏస్ మోసం చేసింది. టిఆర్ఏస్ వైఫల్యాన్ని బీజేపి పై నెట్టే ప్రయత్నం చేసారు. వరి ఇష్యూ ను డైవర్ట్ చేసేందుకే జీవో 317 తీసుకోచ్చారు. కోవిడ్ నిబంధనలు టిఆర్ఏస్ కు వర్తించవా .. వేలాది మందితో రైతు సంబురాలు ఎలా చేస్తున్నారు. మా పార్టీ ఆఫీస్ లో దిక్ష చేస్తుంటె అరెస్ట్ చేసిన పోలీసులు .. టిఆర్ఏస్ మీటింగ్ లకు పర్మిషన్ లు ఎలా ఇస్తున్నారు. బీజేపిని చూస్తే కేసిఆర్ కు గుబులు పుడుతుంది. మీరు పోరాడండి మేమున్నామంటూ మాకు జాతియ నాయకత్వం భరోసా ఇచ్చిందన్నారు.