రాష్ట్రంలో కొత్త పొత్తులకు అవకాశమే లేదని, ఇప్పటికే బిజెపి-జనసేన పొత్తులో ఉన్నాయని, మరో కొత్త పార్టీకి ఇందులో చోటు లేదని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు. తాము చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. వైసీపీనే ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దీనితో పాటు టిడిపిని కూడా ఓడించడమే తమ ముందున్న విధానమని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. పొత్తుల విషయంలో భ్రమలు అవసరం లేదని, ఈ విషయంలో ఇతర పార్టీలు అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రకటనలు చేస్తూ అయోమాయం సృష్టిస్తున్నాయని విమర్శించారు.
నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ టిడిపి, వైసీపీలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశాయని, కుటుంబ పార్టీల వల్ల అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే రాష్ట్రంలో ఓ సరికొత్త ప్రత్యామ్నాయం అవసరమని అభిప్రాయపడ్డారు. పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చని, కానీ వారసత్వ రాజకీయాలు రాష్ట్రానికి మంచిది కాదని లోకేష్ పై పరోక్షంగా వ్యాఖ్యానించారు. తండ్రి తరువాత కొడుకే నాయకుడని చెప్పదలచుకున్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని జీవీఎల్ ఆరోపించారు. టిటిడి తీసుకుంటున్న నిర్ణయాలు భగవంతుణ్ణి భక్తులకు దూరం చేసే విధంగా ఉన్నాయని, దీనిపై అన్యమతస్తుల కుట్రలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఓ అజెండాగా తీసుకొని హిందూ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ అభివృద్ధి పై ప్రస్తావిస్తామని, ఈ ప్రాంతాలకు రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిధులు తెచ్చి పనులు మొదలయ్యఎలా చూస్తామని హామీ ఇచ్చారు.