వైఎస్ జగన్ పాలనలో పంచదార కూడా చేదుగా తయారైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, ఆదాయం మాత్రం పెరగలేదని విమర్శించారు. ఈ అసమర్ధ ప్రభుతం వల్లే పేదల పరిస్థితి మరింత దయనీయంగా తయారైందన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్స్ లో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు పుట్టినిల్లు లాంటిదని, తాను మొదటినుంచీ మహిళా పక్షపాతినని, డ్వాక్రా సంఘాలను తన హయంలోనే మొదలు పెట్టామని అన్నారు. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే తన లక్ష్యమని, జగన్ సృష్టించిన ఆర్ధిక సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తామని హామీ ఇచ్చారు.
మన పక్క రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని, దీని ప్రభావం రవాణాపై పడి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పేర్కొన్నారు. దేశానికి ఆర్ధిక శాఖ మంత్రి చేసే పనికంటే కుటుంబంలో మహిళలు ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దడమే క్లిష్టమైన పని గా ఉంటుందన్నారు. మహిళలను సూపర్ పవర్ గా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని, అందుకే తాము మహిళా శక్తి పథకాన్ని ప్రకటించామన్నారు.
జగన్ చెప్పే మాటలకు – చేసే పనులకు పొంతన లేకుండా పోయిందని, ప్రజలను మభ్యపెట్టి ఈ ఐదేళ్లూ పాలన కొనసాగించాడని దుయ్యబట్టారు. తినడానికి చేప అవసరమని, చేపలు ఇస్తూనే వాటిని పట్టుకునే మార్గం చూపిస్తూ కుటుంబాల ఆదాయం పెంచడమే తన లక్ష్యమన్నారు.
అసమర్ధ, చేతగాని ప్రభుత్వంతో అన్నీ ఇబ్బందులే వస్తాయని, సమర్ధవంతమైన ప్రభుత్వం ఉంటే మీ జీవితాలు బాగుపడతాయంటూ మహిళలను ఉద్దేశించి హితవు పలికారు. ప్రజలు గెలవాలి- రాష్ట్రం నిలబడాలన్నది లక్ష్యం కావాలన్నారు. ఎన్నికలకు నేటినుంచి ఇంకా 19 రోజులే మిగిలి ఉందని, మే 13న ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని, జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి వేయాలని పిలుపు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబ భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని స్పష్టం చేశారు.