Dk Aruna : ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్ రావు పేదల పక్షాన ఆలోచించాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హితవు పలికారు. మెడికల్ కాలేజి, నర్సింగ్ కాలేజి పేరుతో బలహీన వర్గాల భూములు బలవంతంగా ప్రభుత్వం తీసుకుంటోందని బిజెపి నేత డీకే అరుణ విమర్శించారు. హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న డీకే అరుణ కెసిఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంత్రి కార్యక్రమంలో గద్వాల లో వైద్య కళాశాలకు ఎక్కడ శంకుస్థాపన చేస్తున్నారో పేర్కొనకపోవటం సిగ్గుచేటన్నారు. ఎందుకు అంత రహస్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశ్నించారు.
78 ఎకరాల్లో పదివేల మందికి ఇల్లు కట్టవచ్చు. గద్వాలలో ఐదు వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పారని ఆరోపించారు. సిఎం హామీ నిజమో కాదో నరసింహ స్వామీ మీద ఒట్టు పెట్టాలి. భారీ పోలీసు బందోబస్తుతో శంకుస్థాపనలు ఎందుకు చేస్తున్నారో వెల్లడించాలని, ప్రజల కోసం పనిచేసే నాయకులకు పోలీసుల బందోబస్తు ఎందుకని అరుణ ప్రశ్నించారు. గద్వాలతో పాటు ఎక్కడ కూడా ప్రభుత్వం ఇళ్ళ కోసం స్థలం సేకరించలేదని ఆరోపించారు. పేదలకు ఇళ్ళ కోసం గతంలో భూమి సేకరించామని, ఏడేళ్ళుగా కెసిఆర్ ప్రభుత్వం ఏమి చేస్తోందని అరుణ మంది పడ్డారు.
తెలంగాణలో పోలీసులు నీచంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేవారిని తీవ్రంగా హింసిస్తున్నారని అరుణ మండిపడ్డారు. ప్రధానమంత్రి శవయాత్ర చేస్తే పట్టించుకోని పోలీసులు సిఎం దిష్టిబొమ్మ కాలిస్తే వాహనాల్లో పరుగుపరుగున వస్తున్నారని ఆరోపించారు. పోలీసులు న్యాయం పక్షాన ఉండి పనిచేయటానికా, ప్రభుత్వానికి గులాం గిరి చేసేందుకు పోలీసులు ఉన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదల కోసం సేకరించిన భూమిలో వారికీ ఇల్లు కట్టించాలని, అందుకు విరుద్దంగా వైద్య కాలేజీ నిర్మాణం చేపడితే సహించే ప్రసక్తే లేదని డీకే అరుణ తెగేసి చెప్పారు. వైద్య కాలేజి, నర్సింగ్ కాలేజి నిర్మించేందుకు ఇతర భూములు చాల ఉన్నాయని, అవసరమైతే జాతీయ రహదారి దగ్గరలో నిర్మించాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం నుంచి తప్పించుకునేందుకే కొత్త ఎత్తుగడ వేశారని డీకే అరుణ ఆరోపించారు. ప్రభుత్వం తీరు మారక పోతే పేదల తరపున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
Also Read : హైదరాబాద్ ఫార్మాసిటీ సిద్ధం