సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళము భూమికి సాగునీరు అందించేలా కృషి చేద్దామని జిల్లా అధికార యంత్రాంగానికి, సాగునీటి శాఖ అధికారులకు మంత్రి కే. తారకరామారావు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో రాష్ట్రస్థాయి సాగునీటి శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా శాసనసభ్యులతో ఆయన సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు విజన్ మేరకే సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించేలా ప్రయత్నం చేద్దామన్నారు.
ఇప్పటికే కాలేశ్వరం ప్రాజెక్టు జలాల రాకతో జిల్లాలో భారీ ఎత్తున వ్యవసాయ సాగు పెరిగిందని, అయితే ప్రస్తుతం మిగిలిపోయిన పనులను పూర్తి చేయడం ద్వారా వ్యవసాయ సాగుని సంపూర్ణం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న ప్రతి చెరువుని నింపడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సాగునీటి వనరుల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించిన సూక్ష్మ స్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని, ఈ దిశగా స్థానిక ప్రజాప్రతినిధులు, రైతాంగం సూచనలను సైతం పరిగణలోకి తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పరిధిలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం, జిల్లాలోని నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే లైన చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, సుంకే రవికుమార్ తదితరుల నుంచి క్షేత్రస్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పనులతోపాటు, అతి తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలో పూర్తిచేసేందుకు వీలున్న పలు ప్రతిపాదనలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. కొన్ని చెరువుల అభివృద్ధితో పాటు అదనంగా నూతనంగా చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టడం ద్వారా మరిన్ని ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతోపాటు ఈ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ విషయంలో స్థానిక రైతాంగం మరియు ప్రజలతో తాము సమన్వయం చేసుకుంటామని, ఇందుకు అవసరమైన నిధులను, ప్రణాళికను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల్లో అతి త్వరగా పూర్తయ్యే పనుల పైన దృష్టిసారించి, వాటిని పూర్తిచేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామస్థాయిలో నీటి వనరులు వాటి కింద ఉన్న ఆయకట్టు ప్రాజెక్టుల వివరాలతో కూడిన ఒక సమగ్ర నివేదికను తయారు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ఈ సమీక్ష సమావేశం ప్రాథమికమైనదని త్వరలోనే క్షేత్రస్థాయి నుంచి వచ్చే సలహాలు సూచనలతో పాటు పనుల పురోగతిపై న మరోసారి సుదీర్ఘ సమావేశం ఏర్పాటు చేస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు.