Saturday, November 23, 2024
HomeTrending Newsప్రతి గింజా కొంటాం: కన్నబాబు హామీ

ప్రతి గింజా కొంటాం: కన్నబాబు హామీ

Paddy Procurement in AP:
వర్షాల కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే సిఎం జగన్ అధికారులకు, మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడారు.  ధాన్యం కొనుగోలుకి, ఎఫ్సీఐకి లింకు ఉంటుందని, నిబంధనలు సడలించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని వెల్లడించారు. నూకల శాతాన్ని 28 నుంచి 35 శాతంకు పెంచి, ఆ జిల్లాల వారీగా కొనుగోలుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలానే, పాడైపోయిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి 3 శాతం ఉన్నదాన్ని 7 శాతం వరకు పెంచాలని కోరామన్నారు. సహజంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు నిబంధనలు సడలించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

రంగు మారిన ధాన్యాన్ని టీడీపీ ఏనాడైనా కొనుగోలు చేసిందా..అని మంత్రి ప్రశ్నించారు. మంచి ధాన్యానికి, రంగు మారిన ధాన్యానికి ఒకే ధర ఇస్తారా అని నిలదీశారు. తమ ప్రభుత్వం 7681 రైతు భరోసా కేంద్రాల ధాన్యం కొనుగోలు చేయాలని మ్యాపింగ్ చేసిందని వెల్లడించారు. ధాన్యం వచ్చింది వచ్చినట్లుగా కొనుగోలు చేస్తున్నామని, ప్రతి ఆర్బీకేకి మిల్లులను అనుసంధానం చేశామని వెల్లడించారు. వర్షాల వల్ల తేమ శాతం ఎక్కువ ఉన్న ధాన్యాన్ని, ఆ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టి, కొనుగోలు చేస్తున్నామన్నారు.  ధాన్యం కొనుగోలుపై ఓ పత్రికలో వచ్చిన వార్తను కన్నబాబు తీవ్రంగా ఖండించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ పచ్చ మీడియాకు ఇష్టం ఉండదని, కానీ, కోట్ల మంది ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకుని 2019 నుంచి నేటి వరకు, ఏ ఎన్నిక జరిగినా, తిరుగు లేని మెజార్టీ  ఇస్తున్నారని, ప్రజల్లో ఉన్న ఇలాంటి నాయకుడికి అడుగడుగునా అడ్డు తగలడానికి మీకు సిగ్గు లేదా అని కన్నబాబు ప్రశ్నించారు.

అఖండ సినిమా గురించి కూడా చంద్రబాబు మాట్లాడారని, బహుశా అఖండ చూసిన ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు మాట్లాడినట్టు కనిపించిందని ఎద్దేవా చేశారు. ఈమధ్య కాలంలో కరోనా దెబ్బకు హైదరాబాద్ లో దాక్కుని, కొడుకుని రాష్ట్రంలో తిప్పితే ఉన్నది కూడా పోయిందని, ఇప్పుడు మళ్ళీ నేను లేస్తే మనిషిని కాదు అంటూ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కన్నబాబు దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రెస్ మీట్ లలో వీడియోలు చూపిస్తున్నారాణి, ప్రజలకు చూపించాల్సింది చంద్ర వీడియోలు కాదని, నిన్న రాష్ట్రానికి వచ్చి మాట్లాడిన మాజీ న్యాయమూర్తి చంద్రు వీడియోలు చూపించాలని హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్