విశాఖలో అరాచకం చేసే రౌడీలను, బెదిరించే గూండాలను కాలుకు కాలు, కీలుకు కీలు తీసి కింద కూర్చోబెడతామని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. National Institutional Ranking Framework(NIRF) నిర్వయించిన సర్వే 2019 లో 29 వ స్థానంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఈ రోజు 76 వ స్థానానికి పడిపోయిందని, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు గంజాయి అమ్ముతారని, వైసీపీ నాయకుల పుట్టినరోజులు చేస్తారని విమర్శించారు. ఏయూలో వెయ్యి మంది అధ్యాపకులు అవసరైమైతే ఈ రోజు కి అవి ఖాళీగానే ఉన్నాయని, చివరకు యూనివర్సిటీలో అక్రమాలు, భూ కబ్జాలు జరుగుతున్నాయని, తాము అధికారంలోకి రాగానే ప్రక్షాళన ఇక్కడినుంచే మొదలు పెడతామని అన్నారు. వైఎస్సార్సీపీని ఆంధ్రా నేలనుంచి, ఉత్తరాంధ్ర నుంచి, విశాఖ నుంచి తన్ని తరిమేసే వరకూ జనసేన నిరంతంరం పోరాటం చేస్తుందని, ప్రజల భద్రత కోసం, భావితరాల కోసం తాము ఉద్యమిస్తామని ప్రకటించారు. వారాహి విజయ యాత్రలో భాగంగా విశాఖ పట్నంలోని జగదాంబ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
25 ఏళ్ళ క్రితం ఇదే జగదాంబ సెంటర్ లో సుస్వాగతం సినిమా షూటింగ్ లో పాల్గొన్నానని, బస్సుపై ఎక్కి పాట చిత్రీకరించారని, ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ వారాహి వాహనం ఎక్కి ఇంతమంది ప్రజానీకం కోసం పోరాడేందుకు కావాల్సిన గుండె ధైర్యం విశాఖ ఇచ్చిందన్నారు. “2019 లో నేను ముందే చెప్పాను, వైసీపీ గెలిస్తే విశాఖలో కొండలతో సహా దొచుకుంటాడు అని అప్పుడు మీరు నమ్మలేదు, ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడో, మీరు ఎన్నుకుంది చాలా దోపిడీలు చేసిన వ్యక్తిని, 5 సంవత్సరాలు ఆ దోపిడీలు భరించాలి, అందుకే అప్పుడు వైసీపీ ని గెలిపించవద్దు” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సింహాద్రి అప్పన్న సాక్షిగా తనకు వాలంటీర్ల వ్యవస్థపై ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు. వారు ప్రజలను అడగ కూడని కొన్ని వివరాలు అడుగుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. “నేను వాలంటీర్ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి మాట్లాడాను, సింహాద్రి అప్పన్న సాక్షిగా చెబుతున్నా, మీ పొట్ట కొట్టాలని చూడను, అవసరమైతే ఇంకో 5 వేలు ఎక్కువ ఇచ్చేవాడిని, కానీ జగన్ మీతో తప్పు చేయిస్తున్నాడు, ప్రజల ఆధార్, బ్యాంక్ వ్యక్తిగత వివరాలు కలెక్ట్ చేసి నానక్ రామ్ గూడ లోని ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ కి ఇస్తున్నారు” అంటూ పవన్ విమర్శలు గుప్పించారు. 30 వేల మంది మహిళలు మిస్ అయితే సిఎం జగన్ ఎందుకు ఒక్క మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదని, ఒక్కసారి కూడా ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు.