Sunday, May 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతియ తియ్యటి జ్ఞాపకాలు

తియ తియ్యటి జ్ఞాపకాలు

Sweet Summer: వేసవిలో ఉక్కపోతలు, వడగాడ్పులు, చెమటతో బట్టలు తడిసి ముద్ద కావడాలు ఎలా ఉన్నా…వేసవిని అనుభవించడానికి కొన్ని ప్రత్యేకమయినవి కూడా ఉంటాయి. అందులో మామిడి పళ్లు ప్రధానమయినవి. మొన్న ఒకరోజు విజయవాడలో పగలంతా రోడ్ల మీద పడి తిరిగి…పక్షులు గూళ్లకు వెళ్లే వేళకు మంగళగిరిలో నా గూటికి చేరుతున్నాను. ఈలోపు ఒక మిత్రుడు ఫోన్ చేసి వాళ్ల ఆఫీసుకు రమ్మన్నాడు. బయలుదేరాను. దారి మధ్యలో ఉండగా ఆఫీసుకు కాదు…ఇంటికి రమ్మన్నాడు. సరే అని వెళ్లాను.

వెళ్లగానే హాల్లో ఏ సి, ఫ్యాన్లు ఆన్ చేసి నా చేతికి ఒక కంచం ఇచ్చాడు. తను ఓ కంచం చేతిలో పట్టుకున్నాడు. ఫ్రిడ్జ్ లో నుండి మామిడి పండ్లు తెచ్చి…ఆ కంచాల్లో సర్దాడు. ఇది పెద్ద రసం; ఇది చిన్న రసం; ఇది పచ్చిగా కనిపిస్తున్నా…లోపల పండి ఉండే పశ్చిమ గోదావరి జిల్లా నుండి వచ్చిన ప్రత్యేక ఫలం; ఇది కొరికి తినేది; రసాలన్నీ ఒత్తి ఉన్నాయి…పొరపాటున మళ్లీ ఒత్తేరు…షర్ట్, ప్యాంట్, ఒళ్లంతా పడుతుంది అని జాగ్రత్తలు చెప్పాడు. ఇది కదా అతిథి మర్యాద అంటే! అనుకుని…కళ్లల్లో ఆనందబాష్పాలు జలజలా రాలుతుండగా…ఒళ్లో కంచం పెట్టుకుని జుర్రుకుని రసం తాగుతూ…పండ్లు కొరుకుతూ…రకరకాల ఆటవిక పద్ధతుల్లో రాతిగుహల్లో ఆదిమానవులు ఆబగా తిన్నట్లు…తృప్తిగా ఇద్దరం మామిళ్ల భోజనం చేశాము. పండుకు- పండుకు మధ్య విరామంలో తను రోజుకు ఆరుకు మించి మామిళ్లు తినలేకపోతున్న నిస్సహాయత మీద నిజంగా నిట్టూర్చాడు. పెరిగే పొట్ట, బరువుకు చేస్తున్న వ్యాయామం గురించి కూడా చెప్పుకుని బాధ పడ్డాడు. మధ్యలో ఎవరో తలుపు తీస్తే…మా ఇద్దరికీ దిష్టి తగులుతుందని వెంటనే తలుపు మూసేశాడు. తరువాత ఊతప్పాలకు కూడా ఊ కొట్టాల్సి వచ్చింది. చివర ఫలశ్రుతిగా ద్రాక్ష తినక తప్పలేదు. ఆ రాత్రికి అదే భోజనం.

అంతకు ముందు రోజు మరో మిత్రుడు కూడా నన్ను మామిళ్ల బుట్టలో పడేశాడు. దానికి తోడు జున్ను నాకిష్టమని నా బలహీనత మీద దెబ్బ కొట్టాడు. జున్ను- ఐస్ క్రీము గిన్నెల్లో ఏది ఎంచుకోవాలో తెలియక బరువెక్కిన పొట్టతో రెండిటికీ సమ న్యాయం చేయాల్సి వచ్చింది. జున్ను తింటూ నువ్ చెప్పే తెలుగు తేటగీతి సీస పద్యాలు వింటుంటే…నా సామిరంగా! అని నన్ను రెచ్చగొట్టాడు. దాంతో తేటగీతి నాలుగో పాదం దాటే లోపే…జున్ను ఆవిరి!

ఇంకొకాయనయితే ఆయన్ను నేను తక్షణం ఎందుకు కలవాలో పూసగుచ్చినట్లు చెప్పాడు. పూతరేకుల్లో పలుచగా చుట్ట చుట్టుకుని ఒదిగిన బాదం, పిస్తాలను పలుకరించాలన్నాడు. కాకినాడ కాజా కడుపులో దాచుకున్న అమృత భాండాన్ని భేదించాలన్నాడు. ఇంకేదో సాగే హల్వా ఆటలు సాగనివ్వకుండా నోట్లో వేసి సాధించాలన్నాడు. ఏమిటిలా బలవంతపెడతారు? అని నిలదీస్తే…పేరు మధు అని పెట్టుకున్నందుకు మధురాలకు పిలిస్తే…ఓ ఎచ్చులు పోతున్నారే? మందు తాగడానికి రమ్మనట్లు పెద్ద ఫోజు కొడుతున్నారు? అని నిలదీశాడు. ఇన్ని మధురాలయితే చివరికి ఆ మందో? డాక్టరు మందో? నిజంగానే అవసరం అని ప్రాసతో కొట్టబోయి…విజయవాడ వారి తెలుగు ముందు మిగతా తెలుగులన్నీ నోరుమూసుకోవాలి కదా! అన్న అలిఖిత భాషా సూత్రమేదో గుర్తొచ్చి…ఇంకా మాట్లాడితే కొట్టేలా ఉన్నాడనుకుని వెళ్లాను. నిజంగానే తీపి కబుర్లు చెబుతూ…తీయటి ఆతిథ్యం ఇచ్చాడు.

ఇంకో పెద్దాయన ముందు ప్రతి విజయవాడ ట్రిప్ లో అటెండెన్స్ వేయించుకుని…ఆయన కొసరి కొసరి వడ్డించే( వడ్డింపించే అన్నది సరైన మాటేమో) అన్నం తినాలి. నాకోసం కారం లేకుండా, పులుపు లేకుండా, ఉప్పు తక్కువతో ప్రత్యేకంగా వంటకాలు చేయిస్తారు. అన్నీ రుచి చూడకపోతే ఆయన మనోభావాలు దెబ్బ తింటాయి. పది ఐటమ్స్ ఒక్కో ముద్ద అయినా తిని తీరాల్సిందే.

ఇలాంటి ఎందరో మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి, ప్రత్యక్ష మాహేశ్వరి అయిన మాతా అన్నపూర్ణేశ్వరి ఇలా…వీరందరి రూపంలో కనిపిస్తూ…నాకు వేళ కాని వేళ అయినా…ఊరు కాని ఊళ్లో అయినా…అన్నం పెడుతూ ఉంటుంది అనుకుని…నమస్కారం పెడుతూ ఉంటాను.

“అన్నపూర్ణే సదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే!
జ్ఞాన-వైరాగ్య-సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!”
అన్నాడు శంకరాచార్యులు అన్నపూర్ణా స్తోత్రం ఫలశ్రుతిలో. అన్నమయ్యాక జ్ఞాన, వైరాగ్యాలను భిక్షగా పెట్టాలని అడగమన్నాడు. అన్నమంటే అడుగుతాము…అడగ్గానే సులభంగా ఇస్తుంది కానీ…జ్ఞాన, వైరాగ్యాలను నాలాంటి వారు అడుగుతారా?
ఒకవేళ అడిగినా- అమ్మ అంత సులభంగా ఇస్తుందా?
ఒకవేళ ఇచ్చినా- నిలుపుకోగలనా?

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్