ICC Women World Cup: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఏడు పరుగులతో ఇంగ్లాండ్ పై అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీఆరంభ మ్యాచ్ లో ఆతిథ్య న్యూజిలాండ్ ను చివరి ఓవర్లో ఓడించిన విండీస్ మహిళలు నేడు ఇంగ్లాండ్ పై కూడా అదే తరహాలో గెలుపొందారు.
డూనేడిన్ లోని యూనివర్సిటీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు 81పరుగులు చేసింది. అయితే అదే స్కోరు వద్ద ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. దొట్టిన్ 31, హేలీ మాథ్యూస్ 45 పరుగులు చేశారు. తర్వాత వచ్చిన నైట్(6), కెప్టెన్ టేలర్(0) ఇద్దరూ విఫలమయ్యారు. ఈ దశలో కాంప్ బెల్లె- కీడియన్ నేషన్ లు ఐదో వికెట్ కు 123 పరుగుల చక్కని భాగస్వామ్యం నమోదు చేసి ఆదుకున్నారు. కాంప్ బెల్లె 66 పరుగులు చేసి అవుట్ కాగా, చీడియన్ 49 పరుగులతో అజేయంగా నిలిచింది. విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఎక్సెల్ స్టోన్ మూడు; స్కైవర్ ఒక వికెట్ పడగొట్టారు.
226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమైంది. తొలి వికెట్ కు 31 పరుగులు చేసింది. ఆ తర్వాత స్వల్ప తేడాతోనే వరుస వికెట్లు చేజార్చుకుంది. విండీస్ బౌలింగ్ లో ప్రయోగాలు చేసింది. మొత్తం ఎనిమిది మంది బౌలింగ్ చేయడం విశేషం.
తొమ్మిదో వికెట్ కు ఇంగ్లాండ్ 61 పరుగుల భాగస్వామ్యం చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించింది. కానీ 48వ ఓవర్లో విండీస్ బౌలర్ మొహమ్మద్ మొదటి బంతికి కాటే క్రాస్ ను రనౌట్ చేయగా, నాలుగో బంతికి శ్రుభ్ సోల్ ను బౌల్డ్ చేయడంతో విండీస్ విజయం సొంతం చేసికుంది. ఇంగ్లాండ్ లో ఓపెనర్ బ్యూమౌంట్-46; సోఫియా డంక్లీ -38; దానియేల్లె వ్యాట్, ఎక్సెల్ స్టోన్ చెరో 33 పరుగులు చేశారు. 47.4 ఓవర్లలో 218పరుగులకు ఆలౌట్ అయ్యింది. విండీస్ బౌలర్లలో షమిల్లా కొన్నెల్ మూడు; హేలీ మాథ్యూస్, అనిసా మొహమ్మద్ చెరో రెండు; అలియా, టేలర్ చెరో వికెట్ పడగొట్టారు.
66 పరుగులు చేసిన కాంప్ బెల్లె కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : మహిళల వరల్డ్ కప్: పాక్ పై ఆసీస్ ఘనవిజయం