న్యూజిలాండ్ తో జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ లో భాగంగా నేడు జరిగిన చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్, షమ్రా బ్రూక్స్ లు తొలి వికెట్ కు 102పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో 19 ఓవర్లలోనే విజయం సాధించింది.
జమైకా, కింగ్ స్టన్ లోని సబీనా పార్క్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 18 పరుగులకే తొలి వికెట్ (గుప్తిల్-15) కోల్పోయింది. జట్టులో గ్లెన్ ఫిలిప్స్ -41 (26 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు ) ; కెప్టెన్ విలియమ్సన్-24; ఓపెనర్ కాన్వే- 21 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది.
విండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ మూడు; అకీల్ హోసేన్ రెండు; డ్రేక్స్, హెడెన్ వాల్ష్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత విండీస్ ఓపెనర్లు కింగ్ -53 (35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ; బ్రూక్స్ -56 నాటౌట్ (59 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ) పరుగులతో సత్తా చాటారు. డెవాన్ థామస్ 5 పరుగులకే వెనుదిరిగినా చివర్లో కెప్టెన్ పావెల్ 15 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 27పరుగులతో అజేయంగా నిలవడంతో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే విండీస్ లక్ష్యాన్ని సాధించింది.
కివీస్ బౌలర్లలో సౌతీ, సోదీ చెరో వికెట్ సాధించారు.
వరుస రెండు మ్యాచ్ లు గెలిచినా కివీస్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది.
విండీస్ ఆటగాడు బ్రాండన్ కింగ్ ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ గెల్చుకోగా, కివీస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కింది.