మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పార్టీ ఆఫీసులోకి ప్రవేశించారు. కార్యాలయంలో లోపల నిర్వహించిన అమ్మవారి పూజలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను వేద పండితులు ఆశీర్వదించారు. అనంతరం నాగ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేష్ వాకోడ్కర్‌ను కుర్చీలో కూర్చోబెట్టారు కేసీఆర్. ఆ తర్వాత నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాట్లాడారు.
లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తొంది..? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ విషయం ఆలోచిస్తే నాకు భయమేస్తోంది. జనాభా విషయంలో మనం చైనాను కూడా దాటేశాం. దేశంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా మారింది. ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయింది. ప్రతి ఎన్నికలోనూ నేతలు కాదు.. జనాలు గెలవాలి. ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతుంది. జనం చంద్రుడు, నక్షత్రాలు కోరడం లేదు.. నీళ్లు ఇవ్వమని కోరుతున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు.
రైతులు బలహీనులు కాదు.. దేశాన్ని నడుపుతున్న బలమైన శక్తులు అని కేసీఆర్ ప్రశంసించారు. రైతులను అవమానించే వారికి తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. దేశానికి అన్నం పెట్టే రైతు పార్లమెంట్‌లో చట్టాలు చేయలేడా? అని ప్రశ్నించారు. దేశంలో 48 శాతం మంది రైతులే ఉన్నారు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే 60 శాతం మందికి ఉపాధి లభిస్తుంది. సరిపడా సాగునీరు, విద్యుత్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. మహారాష్ట్ర బడ్జెట్ రూ. 10 లక్షల కోట్లకు చేరాలి. మధ్యప్రదేశ్‌లో కూడా బీఆర్ఎస్ రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని కేసీఆర్ తెలిపారు.
దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం మేధావులు, యువత ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్మాణాత్మక మార్పు వస్తేనే దేశంలో ఎలాంటి అభివృద్ధి అయినా సాధ్యం అవుతుందన్నారు కేసీఆర్.
వ్యవసాయం ప్రధాన వృత్తి కలిగిన దేశం మనది అని కేసీఆర్ అన్నారు. రైతులను ఆదుకునేందుకు ఏ ప్రభుత్వమూ ప్రయత్నించలేదు. పప్పులు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీపావళికి పేల్చే పటాకులు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో అవసరానికి మించిన నీటి వనరులు ఉన్నా ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాం. దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నా తాగు నీటి కోసం ప్రజలు గోసపడుతున్నారు. దేశ జల విధానాన్ని వెంటనే మార్చాల్సిన అవసరం ఉంది. నదుల నీటి కోసం రాష్ట్రాల మధ్య ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి.