Tuesday, December 3, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమా కాలనీ కథలు-4

మా కాలనీ కథలు-4

ఎంత చెట్టుకు అంత గాలి. మా నిరుపేద కాలనీ గోవాకు, ఇటలీకి వెళ్లి కలవారిలా డెస్టినేషన్ వెడ్డింగులు చేసుకోలేదు కదా! ఉన్నవారికి ప్రతి సందర్భమూ వారి స్థాయిలో ధూమ్ ధామ్ గా చేసుకోదగ్గ పండగే అయినట్లు లేనివారికి కూడా ప్రతి సందర్భమూ వారి స్థాయికి తగ్గట్టు చేసుకోదగ్గ పండగే కదా!

కాబట్టి ఉన్నంతలో ఇంటి ముందే కొబ్బరాకుల పందిరో, గుంజలు పాతి షామియానానో వేయక తప్పదు కదా! అలాంటప్పుడు ఒక పూటో, ఒక రోజో రోడ్డు మీద ఫంక్షన్ చేసుకోవడం వల్ల ట్రాఫిక్ ను మళ్లించక తప్పదు కదా!

ఇంట్లో పిల్లలకు పెళ్లి కుదిరితే ఇంటిముందు షామియానా వేసి చుట్టుపక్కలవారిని పిలిచి దావత్ ఇవ్వాలా! వద్దా!
కోడలు తొలిసారి ఇంటి గుమ్మం తొక్కుతుంటే ఇంటి ముందు పందిరి వేయాలా! వద్దా!
రోడ్డు మీదే రాళ్లు పేర్చిన కుంపట్లలో కట్టెలు పెట్టి గంగాళాలకు గంగాళాల చికెన్ బిర్యానీలు వండాలా! వద్దా!

సుబ్బి పెళ్లి ఎంకి చావుకు రాకపోతే- తెలుగు సామెత చిన్నబుచ్చుకుంటుందా! లేదా!
శుభాలకు జరిపినట్లే అశుభాలకు కూడా హడావుడి చేయాలా! వద్దా!
ఇంట్లో పెద్ద ప్రాణం హరీమంటే ఆ ప్రాణం ఫోటో ఏ ఫోర్ సైజ్ జెరాక్స్ కూడలిలో నాటాలా! వద్దా!
ఆ పార్థివ దేహాన్ని ఇంటి ముందు పెట్టి…షామియానా వేయాలా! వద్దా!
అప్పుడు కూడలిలో రాళ్లు అడ్డు పెట్టి ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలా! వద్దా!

శుభాశుభాలను ఒకటిగా చూడాలన్న వేదాంత ధోరణికి మా కాలనీ నిలువెత్తు సాక్ష్యం. అటు ఉత్తరం నుండి దక్షిణానికి పెళ్లి బరాత్ మేళ తాళాలతో డి జె మోతతో వెళుతూ ఉంటుంది. అదే వేళకు దక్షిణం నుండి ఉత్తరానికి శవయాత్ర చావు డప్పుల మోతతో మొదలవుతుంది.

“ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం
మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవీ గాలులే”
అన్న పాట దక్షిణ శ్రుతిలో వినపడుతుంటే…

“ఈ జీవన తరంగాలలో..
ఆ దేవుని చదరంగంలో..
ఎవరికి ఎవరు సొంతము?
ఎంతవరకీ బంధము?

కడుపు చించుకు పుట్టిందొకరు..
కాటికి నిన్ను మోసేదొకరు..
తలకు కొరివి పెట్టేదొకరు..
ఆపై నీతో వచ్చేదెవరు?

మమతే మనిషికి బందిఖానా
భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటపడి
ఋణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది”
అన్న పాట ఉత్తర శ్రుతిలో వినపడుతూ ఉంటుంది.

సరిగ్గా ఆ సమయానికి ఆకాశవాణిలో మనం కోరని పాటగా-
“రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్”
అని సందర్భోచితంగా వినపడుతూ ఉంటుంది.

నాగరిక సమాజంలో ఇలా అత్యంత జనసమ్మర్దమైన నగరంలో రోడ్లను అడ్డగించి; దారులు మళ్లించి నడి రోడ్లమీద పూటకో ఫంక్షన్ చేసుకోవడం ఏమి మర్యాద అని? అడిగేవారే లేరా? అని మనసులోకూడా అనుకోకపోవడంలోనే ఉంది మన నాగరికత!

“your freedom ends where my nose begins-
నా ముక్కు ఎక్కడ మొదలైతే అక్కడ నీ స్వేచ్ఛ ముగుస్తుంది!”

అనే కదా అన్నారు. మా కాలనీలో ఎవరి ముక్కూ ఎక్కడా మొదలవ్వదు కాబట్టి…ఎవరి స్వేచ్ఛ ఎక్కడా ఎప్పటికీ ముగియదు!

ముక్కు మూసుకుని బతికే జనానికి ముక్కు దగ్గర ముగిసే స్వేచ్ఛ గురించి ఎలా తెలుస్తుంది చెప్పండి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్