రైల్ ఓపెనింగ్ పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోడీ ఈ ప్రాంతం పై మరోసారి విషం చిమ్మారని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో తనను కలిసిన మీడియాతో ఆయన ప్రధాని పర్యటన పై తీవ్రంగా స్పందించారు. ఇక్కడ అభివృద్ధిని చూసి ప్రధాని మోడీ తట్టుకోలేక పోతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ప్రసంగం ఆసలు ప్రధాని హోదాకు తగ్గట్లే లేదని ఆయన దుయ్యబట్టారు. ఆ ప్రసంగం ఆసాంతం మోసపూరితంగా సాగిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణాలో అభివృద్ధి పథంలో దూసుకు పోతుండగా బిజెపి పాలనలో అవినీతి మయంగా మారిందని ఆయన ఆరోపించారు.
బిజెపిని ప్రతిఘటిస్తున్నందుకే బి ఆర్ యస్ తో సహా విపక్షాలపై సిబిఐ, ఈడి, ఐటి వంటి కేంద్ర సంస్థలను ఎగబెడ్తున్నారని ఆయన ఆరోపించారు. దారికి వచ్చి బిజెపి గూటికి చేరితే మాఫీ అని లేదు అంటే అక్రమ కేసులతో సతాయించడం ఢిల్లీ పెద్దలకు పరిపాటిగా మారిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే ఢిల్లీ పెద్దలకు వణుకు మొదలైందని అందులో భాగమే ఈ రోజు పర్యటనలో తెలంగాణపై ప్రధాని విద్వెషపు ప్రసంగమంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.