Sunday, January 19, 2025
HomeTrending NewsRabi Crop: మిల్లర్లు అలసత్వం వీడాలి - మంత్రి జగదీష్ రెడ్డి

Rabi Crop: మిల్లర్లు అలసత్వం వీడాలి – మంత్రి జగదీష్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ లో జిల్లా నుండి కొనుగోళ్ల లక్ష్యం ఏడు లక్షల నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 20 వేల బస్తాలు మాత్రమే సేకరించడం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి తవిస్మయం వ్యక్తం చేశారు. 213 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇంత తక్కువ సేకరించడం ఏమిటంటూ అధికారులను ఆయన నిలదీశారు.ధాన్యం కొనుగోళ్ళకు ప్రత్యేక అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
బుధవారం ఉదయం సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా యస్ పి రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్ రావు లతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిద శాఖాదిపతులు, రైస్ మిల్లర్లు,ట్రాన్స్ పోర్టు నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కొనుగోళ్లు వేగవంతం చెయ్యక పోతే చర్యలు తప్పవంటూ ఆయన అధికారులను హెచ్చరించారు. జిల్లాలో 72 రైస్ మిల్లులు ఉండగా 37 మిల్లులు మాత్రమే ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడం ఎందని ఆయన అధికారులను ప్రశ్నించారు.
అదే సమయంలో అటు రైస్ మిల్లర్లు ఇటు ట్రాన్స్ పోర్ట్ యజమానులు అలసత్వం ప్రదర్శించ రాదని ఆయన పేర్కొన్నారు. సరిపడ హామిలీలను యుద్ద ప్రాతిపదికన నియమించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు.నాణ్యత ప్రమాణాల పేరుతో కోతలు వలదని ఆయన సూచించారు. అదే సమయంలో రైతులకు నాణ్యత అంశంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీదనే ఉంటుందన్నారు. అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు అధికారులు బాసటగా నిలబడాలని అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. సి యం ఆర్ బియ్యం అక్రమాలపై మంత్రి జగదీష్ రెడ్డి కొరడా ఝళిపించారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారినుండి రికవరీ చెయ్యాలని అధికారులను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. అంతే గాకుండా డీ-ఫాల్టర్ల పై దృష్టి సారించాలన్నారు.తడిసిన ధాన్యం గురించి రైతులు ఆందోళన పడొద్దని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అదేశించారన్నారు.అకాల వర్షాలకు పంట నష్టం వివరాలు సే కరిస్తూన్నట్లు ఆయన ప్రకటించారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి రైతులను ఆదుకుంటామని ఆయన తెలిపారు.ధాన్యం కొనుగోళ్ల తో పాటు అకాల వర్షాలకు సంభవించిన పంట నష్టంపై చిల్లర రాజకీయాలు తగదని ఆయన విపక్షాలకు ఉద్బోధించారు. వ్యవసాయానికి గౌరవం పేరిగిందీ అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ చలువతోటే అన్నది ప్రపంచానికి తెలుసు అని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్