Tuesday, September 17, 2024
HomeTrending NewsROB: కేంద్రంపై నిందలు సిగ్గుచేటు - బండి సంజయ్

ROB: కేంద్రంపై నిందలు సిగ్గుచేటు – బండి సంజయ్

తీగలగుట్టపల్లి ఆర్వోబీ మంజూరు మా ఘనతేనంటూ నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు 8 ఏళ్లుగా పనులెందుకు చేపట్టలేదని బిజెపి రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఆర్వోబీ నిర్మాణ వ్యయంలో అసలు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్లుంది బీఆర్ఎస్ నాయకుల తీరన్నారు. నయాపైసా కూడా కేటాయించకుండా ఇచ్చిన మాట తప్పిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఇదంతా తమ ఘనతేనంటూ చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్  ఈరోజు ప్రకటన విడుదల చేశారు.

కరీంనగర్ ప్రజల ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకుని కేంద్ర పెద్దలతో మాట్లాడి ఆర్వోబీ నిర్మాణ వ్యయం మొత్తం 126 కోట్ల 74 లక్షల రూపాయలను కేంద్రమే భరించేలా ఒప్పించాను. 8 నెలల క్రితమే కేంద్రం ఆమోదం తెలిపినా నాటి నుండి నేటి వరకు ఎందుకు పనులు ప్రారంభించలేకపోయారు? జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ధర్నాలు, ఆందోళనలు చేసింది నిజం కాదా? తొందరగా ఆర్వోబీ పనులు ప్రారంభించాలంటూ ప్రభుత్వానికి, అధికారులకు నేను లేఖలు రాసింది వాస్తవం కాదా?

ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే… ఒప్పందాన్ని ఉల్లంఘించింది, నయా పైసా ఇవ్వకుండా జాప్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి కేంద్రం వల్లే జాప్యమవుతోందంటూ కేంద్రంపై నిందలేయడం సిగ్గు చేటు. రేపు ఆర్వోబీ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారనే వార్తలు పత్రికల్లో చూశాను. ఆర్వోబీ మంజూరు, సత్వర నిర్మాణం కోసం నిరంతరం క్రుషి చేసిన తనకు ఇంతవరకు సమాచారం పంపకపోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రోటోకాల్ మర్యాద పాటించలేని విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియకపోవడం క్షమించరానిది.

ప్రతీది మా ఘనతేనంటూ నీతులు చెబుతున్న నేతలు వరంగల్ –కరీంనగర్, ఎల్కతుర్తి-సిద్దిపేట, కరీంనగర్ –జగిత్యాల రహదారి విస్తరణ పనులకు 8 ఏళ్లుగా నిధులెందుకు సాధించలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్ ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. జరుగుతున్నవన్నీ గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని బండి సంజయ్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్