Saturday, November 23, 2024
HomeTrending NewsWilma Rudolph: ప్రపంచంలోనే.. ఫాస్టెస్ట్ ఉమన్

Wilma Rudolph: ప్రపంచంలోనే.. ఫాస్టెస్ట్ ఉమన్

ఆమె ప్రపంచంలోనే ” ఫాస్టెస్ట్ ఉమన్! ” అవును, ఆమె ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఉమన్ గా చరిత్ర సృష్టించారు. పేరు విల్మా రుడాల్ఫ్. పరుగుల రాణి. మేటి అమెరికన్ బ్లాక్ స్ప్రింటరుగా చరిత్రపుటలకెక్కారు. ఇప్పటికీ ఆమె పరుగుల వేగాన్ని అసాధారణ మైనదిగా చెప్పుకుంటారు

అమెరికా కోసం రెండు ఒలింపిక్సులలో మూడు బంగారు పతకాలను, ఒక కాంస్య పతకాన్ని పొందిన విల్మా రుడాల్ఫ్ ఒకటి రెండు మాటలు….

1940 జూన్ ఇరవైమూడో తేదీన నెలలు నిండకముందే పుట్టిన విల్మా రుడాల్ఫ్ ఎడమకాలు నాలుగో ఏట నుంచి పోలియోతో చచ్చుబడింది. దాంతో ఆమె నడవటం చాలా కష్టమని వైద్యులు చెప్పేసారు.

కానీ విల్మా తల్లి మాత్రం తన బిడ్డ అందరిలా నడుస్తుందనే నమ్మకంతోనే ఉన్నారు. అది అమ్మ మనసు అని అందరూ అనుకున్నారు. అమ్మ మాటలను పూర్తిగా నమ్మింది విల్మా.

విల్మా కుటుంబం ఓ సాధారణ కుటుంబం.ఆమె తల్లి పని చేస్తేనే పిల్లల అయిదు వేళ్ళు నోట్లోకెళ్తాయి. విమ్లా అక్కకు, అన్నయ్యకు మందు ఇచ్చి రోజూ మూడు పూటలా కాలికి రాసి మర్దనం చేయమని చెప్పి ఆమె పనికి పోతుండేవారు. అన్నయ్యలు, అక్కలు విల్మా తమలాగా త్వరగా నడవాలనే ఏకైక ఆశతో రోజుకు అనేకసార్లు మందు పూసేవారు.
అయితే స్వల్పకాలానికే విల్మా కాలిపర్స్ తో నడవగలిగారు. అయినప్పటికీ థెరపీ, శిక్షణ కొనసాగాయి. వైద్యులు తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పేసినా విల్మా పన్నెండో ఏట అందరిలా మామూలుగా నడిచారు. అంతేకాదు, ఊహకందనంత వేగంగా విల్మా పరుగెత్తగలిగారు. అంతా బాగుందనుకున్న సమయంలో ఆమెకు జ్వరం వచ్చింది. మళ్ళీ నడక నెమ్మదించింది. అంతమాత్రాన డీలా పడిపోక ఆమె ఇరుగుపొరుగు పిల్లలతో పోటీపడి పరుగెడుతు వచ్చారు.

స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో ఆమె బాస్కెట్ బాల్ క్రీడాకారిణి కావాలనుకున్నారు. కారణం ఆమె మంచి పొడగరి. అనుకున్నట్టే బాస్కెట్ బాల్ ఆటలోని మెళకువలను వొంట పట్టించుకున్నారు. పరుగుల ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆమె రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్లో పాల్గొన్నారు కూడా.

పదహారవ ఏట 1956 మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) ఒలింపిక్సులో పాల్గొనే అవకాశం లభించింది. పోటీ పడిన తొలి ఈవెంట్ 4 x 100 మీటర్ల రిలేలో
ఆమెకు కాంస్య పతకం దక్కింది. అనంతర పోటీలో ఆరునూరైనా స్వర్ణం గెల్చు కోవాలనుకున్నారు విల్మా.

ఆమెలోని పరుగుల వేగాన్ని గుర్తించిన కోచ్ ఎడ టెంపుల్ 1960 ఒలింపిక్సులో విల్మాను అమెరికా జట్టుకు ఎంపిక చేసారు.

ఇరవయ్యో ఏట రోమ్ (ఇటలీ) ఒలింపిక్సులో పాల్గొన్న విల్మా ఏకంగా మూడు స్వర్ణ పతకాలందుకున్నారు. అంతేకాదు, 1960లో ప్రపంచంలోనే అతి వేగంగా పరుగెత్తగల మహిళగా ఖ్యాతి గడించారు విల్మా!! ఈ ఒలింపిక్సులో ఆమె 4 x 100 రిలే, 100 మీటర్లు, 200 మీటర్లలో బంగారు పతకాలు గెల్చుకున్నారు.

నడవనే నడవదని చెప్పిన డాక్టర్ల మాటలను వమ్ము చేసిన విల్మా పరుగుల రాణిగా తన దేశానికి కీర్తిప్రతిష్ఠలు సంపాదించి పెట్టడంతోపాటు చరిత్రపుటల్లో పేరు సంపాదించడం విశేషం. ఆమెను ఫ్రెంచ్ పాత్రికేయులు “The Black Pearl,” అని అభివర్ణిస్తే, ఇటాలియన్ ప్రెస్ “The Black Gazelle,” అని, అమెరికన్లు ఆమెను “The Tornado” అని పేర్కొన్నారు. అలనాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనడీ విల్మాను, ఆమె తల్లిని వైట్ హౌసుకి ప్రత్యేకంగా ఆహ్వానించి సమ్మానించారు.
ముప్పై నిముషాలపాటు ఆమెతో మాట్లాడారు.

విల్మా రిటైర్ అయ్యేనాటికి మూడు ప్రపంచ రికార్డులు ఆమె పేరిట ఉన్నాయి. అవి, 100-మీటర్లు (11.2 సెకండ్లు), 200 మీటర్లు (22.9 సెకండ్లు), and 4 x 100 మీటర్ల రిలే (44.3 సెకండ్లు). ఆమె సాధించిన ఈ రికార్డులు చాలా కాలం కొనసాగాయి.

ఆమె క్యాన్సర్ తో 1994లో మరణించారు. అప్పటికి ఆమె వయస్సు 54 ఏళ్ళు.

బెర్లిన్ (జర్మనీ)లో ఓ హైస్కూలుకి ఆమె పేరు పెట్టారు. ఇక అమెరికా పోస్టల్ శాఖ 2004లో ఆమె గౌరవార్థం ఓ స్టాంప్ విడుదల చేసింది. అలాగే ప్రతి ఏటా జున్ 23ని Tennessee (అమెరికా)లో Wilma Rudolph Dayగా జరుపుకుంటారు. Clarksville (అమెరికా)లో ఆమె స్మృత్యర్థం ఓ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్