దేశంలో పగటి ఉష్ణోగ్రతలు గత మూడు రోజుల నుంచి దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలిపులి పంజా విసురుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్సియస్ దిగువకు పడిపోయాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు పొగమంచు కమ్ముకోవటంతో ఢిల్లీ నుంచి బయలుదేరే అనేక రైళ్ళు రద్దు చేశారు. చాల రాష్ట్రాల్లో రైళ్ళు గంటలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో చలి గాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్చంద సంస్థలు వయసు మళ్ళిన వృద్దుల కోసం ప్రత్యేకంగా సేవ కార్యక్రమాలు చేపట్టాయి.
ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే 15 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ వెల్లడింది. ఉత్తరాది రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సిటీలో ఇవాళ అత్యంత అల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. కాన్పూర్‌లో 11 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి చంపేస్తున్నది. దాంతో చలి బాగా పెరిగిపోయింది. జనం ఇండ్ల నుంచి కాలు బయటపెట్టలేక పోతున్నారు. పైగా గత కొన్ని రోజుల నుంచి చలి ప్రతాపం కొనసాగుతుండటంతో దాని నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటున్నారు.