పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల 29వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 29వ తేది నుంచి డిసెంబర్ 23వ తేది వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ తేదిల్లో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే శాఖ పరమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
పోయిన ఏడాది కరోనా మహమ్మారి వ్యాప్తితో శీతాకాల సమావేశాలు జరగలేదు. ఇటీవల వర్షాకాల సమావేశాలు జరిగినా పెగాసస్ వ్యవహారం, రైతు చట్టాలకు నిరసనలతో అట్టుడికాయి. ఈ దఫా పెట్రో ధరలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. ప్రధాన పార్టీలకు ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలకం కావటంతో ఈ రాష్ట్రాల సమస్యలను ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ జిల్లాలో రైతుల మృతి,అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన పశ్చిమ బెంగాల్, అస్సాం, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా బలగాలకు గతంలో పదిహేను కిలోమీటర్ల వరకు ఎలాంటి అనుమతి లేకుండా సోదాలు చేసి అరెస్టు చేసేందుకు అధికారం ఉండేది. తాజాగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ పరిధిని 50 కిలోమీటర్ల వరకు పెంచింది. దీనిపై పంజాబ్లో రాజకీయ పార్టీలు ఎన్నికల అస్త్రంగా పార్లమెంటులో ప్రస్తావించే అవకాశం ఉంది.