Saturday, November 23, 2024
HomeTrending Newsసమాజానికి దారి చూపే రచనలు రావాలి

సమాజానికి దారి చూపే రచనలు రావాలి

పుస్తక పఠనాభిరుచి తగ్గుతున్న ఈ కాలంలో అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటూనే సమాజానికి దారి చూపగల రచనలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక మంత్రి వి.శ్రీనివాసగౌడ్ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డా.దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో సోమవారం జరిగిన తెలంగాణ సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లలకు విద్యార్థి దశలోనే స్ఫూర్తి కలిగించి, అనంతరకాలంలో ఉత్తమ పౌరులుగా రూపొందే విధంగా రచనలు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. తెలంగాణలో కవులు, కళాకారులకు కొరత లేదని, ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ గొప్పదనాన్ని తమ రచనల్లో ప్రతిబింబింపజేస్తున్నారన్నారు. సామాజిక మాధ్యమాలను మంచికోసం ఉపయోగించాలన్నారు. అన్ని పోరాటాల కాలంలో సాహిత్యం తన ప్రభావం చూపిందని పేర్కొన్నారు. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సభకు అధ్యక్షత వహించారు. పురస్కారాల ఎంపిక ప్రామాణిక పద్ధతిలో సవ్యంగా జరిగిందని, సుమారు 80 ఏళ్ళ చరిత్ర కలిగిన తమ సంస్థ విశిష్ట కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.

శాంతా బయోటెక్నిక్స్ అధినేత పద్మభూషణ్ డా.కె.ఐ. వరప్రసాదరెడ్డి విశిష్ట అతిథిగా ప్రసంగిస్తూ పుస్తకాలు ప్రయోజనదాయకంగా ఉన్నప్పుడే సార్థకత చేకూరుతుందని అన్నారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జె. చెన్నయ్య స్వగతోపన్యాసం చేశారు. కథా ప్రక్రియలో కె.వి. నరేందర్, విమర్శలో కె.పి. అశోక్ కుమార్, ఇతర ప్రక్రియలో అన్నవరం దేవేందర్‌లకు పురస్కారాలు అందజేశారు. వచన కవిత్వంలో నాగరాజు రామస్వామి తరపున తుమ్మూరి రాంమోహనరావు, నవలా ప్రక్రియలో పరవస్తు లోకేశ్వర్ తరపున రాపోలు సుదర్శన్ పురస్కారం అందుకున్నారు.

ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి, ప్రముఖ కవులు వేణుసంకోజు, డా.దామెర రాములు, సాహితీవేత్త ఐతా చంద్రయ్యలకు వరిష్ఠ పురస్కారం అందజేశారు. ఒక్కొక్కరికి 20 వేల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. తగుళ్ళ గోపాలకు యువ పురస్కారం కింద 10 వేల రూపాయలు నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు వందన సమర్పణ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్