హత్య కేసులో అరెస్టయిన రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఉద్యోగం నుంచి తొలగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. భారత దేశానికి రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు అందించిన సుశీల్ ను చీఫ్ కమర్షియల్ మేనేజర్ గా ఉత్తర రైల్వే లో ఉద్యోగం ఇచ్చారు. అయితే ప్రభుత్వ స్కూళ్ళలో క్రీడాభివృద్ధికి సలహాలు ఇచ్చేందుకు సుశీల్ ను ఢిల్లీ ప్రభుత్వం ఒఎస్డిగా డెప్యుటేషన్ పై విధుల్లోకి తీసుకుంది.
ఈనెల 4న చత్రసాల్ స్టేడియం వద్ద జరిగిన రెజ్లర్ సాగర్ హత్య కేసులో సుశీల్ దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 15 రోజులుగా పరారీలో ఉన్న ఆయన్ను నిన్న ఉదయం ఢిల్లీ పోలీసులు పంజాబ్ లోని జలంధర్ లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
సుశీల్ అరెస్టు పై ఢిల్లీ పోలీసులు రైల్వే శాఖకు సమాచారం ఇచ్చారు. అతనిపై నమోదైన ఎఫ్ ఐ ఆర్ కాపీని కూడా పంపారు. దీన్ని పరిశీలించిన తరువాత సుశీల్ ను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు ఉత్తర రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి దీపక్ కుమార్ వెల్లడించారు. దీనికి సంబందించిన ఉత్తర్వులను రెండ్రోజుల్లో వెలువరిస్తామన్నారు.