Thursday, September 19, 2024
HomeTrending NewsBRS: ధరణితో దళారీ వ్యవస్థ పోయింది - సిఎం కెసిఆర్

BRS: ధరణితో దళారీ వ్యవస్థ పోయింది – సిఎం కెసిఆర్

ఉచిత కరెంటుపై తమది ఉక్కు సంకల్పమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కరెంటు ఇవ్వటం అంటే తమాషా కాదని, 24 గంటల విద్యుత్తు ఇవ్వటం వల్లే ఇవాళ వడ్లు ఉసికె పండినట్టు పండుతున్నాయని తెలిపారు. 24 గంటల కరెంటు ఇస్తే రైతులు వీలును బట్టి పంటకు నీళ్లు పెట్టుకుంటారని స్పష్టం చేశారు. 3 గంటల విద్యుత్తు అంటే.. ‘3 గంటలతోని యాడబోస్తరయా.. 24 గంటలు ఇస్తే బతుకుతం కానీ. అదెట్లా సాధ్యం’ అని రైతులు తిడుతున్నరని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పండిన వడ్లకు, ఉన్న గిర్నీలు చాలటం లేదని వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, భువనగిరి ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వందల మంది అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 24 గంటల కరెంటు ఇచ్చేందుకు అనేక ఇబ్బందులు పడ్డామని నాటి కష్టాలను ఒక్కొక్కటిగా వివరించారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ధరణి పోర్టల్‌ ద్వారా చాలా అద్భుతాలు జరుగుతున్నయ్‌. గతంలో రైతుల వద్ద ఓ భూమి ఉండేది. దానికి పట్టాలు కూడా ఉండేవి. ఆ భూమి వారిదే అయినా దానికి ఎంతోమంది యజమానులు ఉండేవారు. వీఆర్వో, గిర్దవార్‌, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌, రెవెన్యూ సెక్రటరీ వరకూ అందరికీ అధికారం ఉండేది. వారంతా పెత్తనం చెలాయించేవారు. కేసులు పెట్టి, దొంగ పంచాయితులు పెట్టేది. వాటిల్లో ఎవడు గెలిస్తే వాడిదే భూమి. ఇవాళ ధరణితో ఈ వ్యవస్థను మొత్తం తీసేశాం. నీ భూమిని నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడూ మార్చలేని విధంగా వ్యవస్థను రూపొందించాం. తెలంగాణ మొత్తం భూభాగమే 2 కోట్ల 75 లక్షల ఎకరాలు. అందులో ఒక కోటి 56 లక్షల ఎకరాలు ధరణిలోకి వచ్చేశాయి. ఒక్కసారి ధరణిలోకి వచ్చిందంటే ఎవ్వరూ మాట్లాడేదే లేదు. భూమి హక్కు యజమాని బొటనవేలు పెడితే తప్ప, నెత్తికొట్టుకున్నా మారది. ఎవ్వరికీ మార్చే అధికారం లేదు. ఆఖరికి సీఎంకు కూడా లేదు. ఎవరు అమ్మినా, కొన్నా వెంటనే సైట్లలో చూసుకోవచ్చు. ఇది తెలియక కొందరు దుష్ప్రచారం చేస్తున్నరు.

ఉమ్మడి రాష్ట్రంల మనం ఆగమైనం. నీళ్లకు గోసపడ్డం. కరెంట్‌కు గోసపడ్డం. ధాన్యం అమ్ముకోవడానికి గోసపడ్డం. వేసిన ఐదెకరాలు పండక, రెండెకరాలే పండినా గోసపడ్డం. రైతులు సిటీ కొచ్చి ఆటోలు నడిపిన పరిస్థితి చూసినం. 20, 25, 30 ఎకరాలున్న రైతులు కూడా కరువు ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఆటోలు నడిపిండ్రు. ఏం జేసైనా సరే రైతును నిలబెట్టాలె.. రైతు సల్లగుంటే పల్లెలు సల్లగుంటయి, పది మందికి అన్నం పెడతరని రైతుల కోసం ఎన్నో చేస్తున్నం. అవి ఫలించాయి. రైతు పథకాల ద్వారా అనేక లాభాలు జరిగినయి. ఇవన్నీ ఒక సంకల్పంతో చేసినం.

కాళేశ్వరంతో నీళ్లు తెచ్చినం. రేపో మాపో బస్వాపుర్‌ రిజర్వాయర్‌ కూడా నిండబోతున్నది. అద్భుతంగా నీళ్లొస్తయి. ఈ సంవత్సరం బస్వాపురాన్ని నింపుతాం. కొత్త ప్రాజెక్టు కట్టినప్పుడు ఒక్కసారే నింపకూడదు కాబట్టి మూడో భాగం చొప్పున నింపుతున్నాం. కాల్వలకు నీరు అందేమందం నీళ్లు వస్తయి. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు బ్రహ్మాండంగా వజ్రపు తునకలైతయ్‌. అంత గొప్పగా నీళ్లు అందిస్తాం. మల్లన్నసాగర్‌ నుంచే నీళ్లు ఇస్తాం. ఆ ప్రాంత రైతులకు నెత్తి మీద కుండ పెట్టున్నట్లే. అదొక నీళ్ల ఖజానా. 50 టీఎంసీ ప్రాజెక్టు. దీంతో భువనగిరి, ఆలేరులో శాశ్వతంగా కరువు రాదు.

అనిల్‌కుమారెడ్డి చాలా ప్రభావంతమైన వ్యక్తి. కష్టపడి వ్యాపారం చేసి జీవితంలో పైకొచ్చిన వ్యక్తి. శేఖర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి చెరొక పోస్టు తీసుకొని మంచిగా పనిచేసుకోవాలని చెప్పా. ఇద్దరూ జోడెడ్లలాగ జోరుగా బండి లాగాలి. భువనగిరి జిల్లా బండి లాగితే.. అద్భుతంగా ముందుకెళ్లాలి. నా మాట గౌరవించి వచ్చారు. వారితోపాటు వారి వెంట వచ్చిన వారికి కూడా హృదయపూర్వకమైన స్వాగతం. అనిల్‌కుమారెడ్డి రాజకీయ జీవితానికి నేనే జిమ్మేదారి. రేపటి తెలంగాణ మీది. భవిష్యత్తు మీది. యువకులు.. పాలించుకునేది మీరే. నడిపించుకునేది మీరే. నేనొక తొవ్వ చూపించిన. ఎవ్వరూ వెయ్యేండ్లు బతకరు కదా. యువకులు విభేదించుకొని రాజకీయాలు చేయొద్దు. నాగార్జునసాగర్‌ నోముల నర్సయ్య చనిపోయినప్పుడు.. ఆయన కొడుకు కాకుండా ఇంకెవరికైనా ఇస్తే బాగోదని ఆయన బిడ్డ భగత్‌కు సీటిచ్చినం. అక్కడ కోటిరెడ్డి అనే లీడర్‌కు నాడే ఎమ్మెల్సీ ఇస్తమని చెప్పిన. నా మాట గౌరవించి కోటిరెడ్డి సహకారం చేశారు.

ఆ తర్వాత ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినం. ఒక్కసారి నేను చెబితే దానికి తిరుగుండదు. అనిల్‌కుమార్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. శేఖర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి కలయిక భువనగిరి జిల్లా అభివృద్ధికి దోహదపడుతుంది. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను సాధించుకున్నం.యాదగిరిగుట్టను అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా చాలా చేయాల్సింది ఉన్నది’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్‌కుమార్‌, రవీంద్రనాయక్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్లమోతు భాసర్‌రావు, భూపాల్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బాల సుమన్‌, జీవన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్లు ఏ సందీప్‌రెడ్డి, బీ నరేందర్‌రెడ్డి, వీ నర్సింహారెడ్డి, డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ భరత్‌కుమార్‌, టీఎస్‌ఫుడ్స్‌ చైర్మన్‌ విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కాంగ్రెస్‌ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పునూతల వెంకటేశ్‌యాదవ్‌, వలిగొండ ఎంపీపీ నూతి రమేశ్‌ ముదిరాజ్‌, వలిగొండ సర్పంచ్‌ లలితాశ్రీనివాస్‌, వలిగొండ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, వలిగొండ కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య, భువనగిరి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎల్లెంల జంగయ్యయాదవ్‌, వరింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంపీటీసీ పాశం శివానంద్‌, మైనార్టీ ప్రెసిడెంట్‌ షరీఫుద్దీన్‌, నమాత్‌పల్లి సర్పంచ్‌ శాలిని, మాజీ ఎంపీపీ కుంభం వెంకట్‌పాపిరెడ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ కుంభం విద్యాసాగర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ వలిగొండ మండల నాయకుడు బీ రమేశ్‌రెడ్డి, వలిగొండ మండల పరిషత్తు ఉపాధ్యక్షురాలు బీ ఉమాదేవి బాలనర్సింహ, జీ రవి, కే వెంకటేశ్‌, బీ సహదేవ్‌గౌడ్‌, వార్డుసభ్యులు ఏ శేఖర్‌, ఆర్‌ శ్రీనివాస్‌, యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ పీ మురళి, పీ సహదేవ్‌, కిరణ్‌కుమార్‌, కే సాయిగౌడ్‌, ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడు పల్లెర్ల సుధాకర్‌, పబ్బు సురేందర్‌, బత్తిని లింగయ్య, మైసోల్ల లక్ష్మీనర్సు సహా భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. వారందరికీ సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రైతులు మూడు, ఐదు రూపాయల మిత్తికి అప్పులు తీసుకునే పరిస్థితి లేదు. ఆ విధానం బందైపోయింది. బ్యాంకు రుణాలు కూడా ఇష్టమొస్తెనే తీసుకుంటున్నారు. లేకపోతే లేదు. ఇదొక మంచి అద్భుతమైన పరిణామం. ఇది రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే పరిణామం. మహారాష్ట్రలో వీఆర్వోను తలాటీ అంటారు. అక్కడి సభల్లో తలాటి ఉండాల్నా? తీసెయ్యాల్నా? అంటే.. ముక్తకంఠంతో తీసెయ్యాలని చేతులెత్తుతుండ్రు. మన ధరణి అంత సదుపాయం దేశంలో ఎక్కడా లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్