Sunday, January 19, 2025
HomeTrending Newsవేదాద్రి యాదాద్రి

వేదాద్రి యాదాద్రి

Yadadri Temple : ఆ లయం…లయమయ్యే దాకా నిలిచి ఉండేది ఆలయం. అలా నిలిచి ఉండాలని కట్టినవే ఇప్పుడు మనం అపురూపంగా, ఆశ్చర్యంగా చూస్తున్న రామప్పలు. భక్తి ప్రపత్తులతో కొలుస్తున్న తిరుమలలు, మధురలు, శృంగేరులు.

దశాబ్దాల కల తెలంగాణ. ఎడతెగని ఉద్యమ ఫలం తెలంగాణ. అమరవీరుల ఆత్మబలిదానాల ప్రతిఫలం తెలంగాణ. కోటి ఆశలతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర్ రావు వేసిన, వేస్తున్న అడుగులు బలంగా ఉంటాయి. వేస్తున్న పునాదులపై బలమయిన భవనాలు లేస్తున్నాయి.

దిగువనుండి ఎగువకు మళ్లే గోదావరి గలగలల్లో కె సి ఆర్ జల స్వప్నం తొంగి చూస్తుంది. బిర బిరా పరుగెత్తే కృష్ణమ్మ తెలంగాణ మాగాణాలకు పచ్చని పట్టు చీర కట్టడంలో కె సి ఆర్ తపన కనిపిస్తుంది.

పెద్ద దృశ్యాన్ని కలగనడానికి సాహసం ఉండాలి. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎత్తిన పిడికిలి దించకుండా సాగే పట్టుదల ఉండాలి. ప్రత్యేక తెలంగాణాను స్వప్నించి, ధ్యానించి, శ్వాసించి…ఆ కలను సాకారం చేసుకున్న తరువాత భవిష్యత్ తరాలకోసం అంతకంటే పెద్ద స్వప్నాలను సాకారం చేసే పనిలో సాహసంతో ముందుకు సాగుతున్నారు.

అలా…సాకారమవుతున్న మరొక పెద్ద స్వప్నం- యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం. ఎంతమంది శిల్పులు ఎన్నేళ్లు శ్రమించారు? ఎంతమంది ఆగమ నిపుణులు ఎంత మేధో మథనం చేశారు? స్తపతులెవరు? రాయి ఎక్కడిది? ఎన్ని వందల కోట్లు ఖర్చయ్యింది? ఎన్ని ప్రాకారాలు? ఎన్ని పుష్కరిణులు? ఎన్ని దీపాలు? ఎన్ని వెలుగులు? ఎన్ని కాటేజీలు? ఇలా అన్ని ప్రశ్నలకు ఇన్నేళ్ళుగా సమాధానాలు వార్తలుగా వస్తూనే ఉన్నాయి. పబ్లిక్ డొమైన్ లో వీటన్నిటికీ అంకెలతోపాటు వివరాలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ రాస్తే చర్విత చర్వణమవుతుంది.

యాదగిరి ఇప్పుడొక వేదగిరి.
యాదగిరి ఇప్పుడొక నూత్నగిరి.
యాదగిరి చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రం.
యాదగిరి తెలంగాణ భక్తికి కట్టిన గోపురం.

దేవుడి కార్యానికి అందరూ పెద్దలే. కానీ యాదగిరిగుట్ట పునర్నిర్మాణంలో కె సి ఆర్ భక్తి, తపన, పర్యవేక్షణ, సలహాలు, సూచనలను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. సనాతన ఆగమ శాస్త్ర విషయాలను పాటించడానికి శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి సలహాలను తీసుకున్నారు. ఇంజనీరింగ్ విషయాలు మొదలు గంటలు, బల్బులు ఎలా ఉండాలో స్వయంగా పర్యవేక్షించారు.

నాలుగ్గోడలు, గోపురమే ఆలయమయితే ఊళ్లో తాపీ మేస్త్రీ కూడా గుడి కట్టేయగలడు. వాస్తు, శిల్ప, ఆగమ శాస్త్రాల సమ్మేళనం గుడి నిర్మాణం. మొక్కుబడిగా గుడి కట్టడం కాదిది. మొక్కుకు ప్రతిఫలంగా తయారవుతున్న గుడి ఇది. కొన్ని తరాలు నిలిచి వెలగాల్సిన నారసింహ తత్వమిది. చరిత్రలో నిలిచిపోయే ఆలయ నిర్మాణమిది.

భక్తి కొందరికి ప్రదర్శన. కొందరికి రాజకీయం. కొందరికి అవసరం. కొందరికి భయం. కొందరికి మొక్కుబడి తంతు.

కె సి ఆర్ భక్తి సహజం. ఎవరేమనుకున్నా హిందూ ఆచారాలను నమ్మి మనసా వాచా కర్మణా పాటించే ముఖ్యమంత్రి. ఆధునిక కాలంలో ఇలా యాగాలు చేయగలరా? అని లోకం ఆశ్చర్యపోయేలా ఆయన యాగాలు చేశారు. రాష్ట్రంగా తెలంగాణ సుభిక్షంగా ఉండడానికి అవసరమయిన క్రతువులు ఆయన మనసులో మెదులుతూనే ఉంటాయి.

ఒక్కో ప్రాంతం ఉనికికి కొన్ని కొండ గుర్తులుంటాయి. తనవైన కొన్ని ఆచారాలు, వేషం, భాష, యాసలు ఉంటాయి. కొన్ని నదులు, పుణ్యక్షేత్రాలు ఉంటాయి. తరాలు మారినా మారకుండా వెలిగేవి, వెలుగుతూ ఉండిపోయేవి కొన్నే ఉంటాయి. అలా ఉండిపోయేది పునర్నిర్మాణమయిన యాదగిరిగుట్ట ఆలయం.

శాస్త్రీయంగా ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం నిర్ణయమయ్యింది. హిరణ్యకశిపుడిని సంహరించడానికి విష్ణువు నరసింహంగా అవతరించాల్సి వచ్చింది. చెడు మీద మంచి గెలవడానికి, మంచి పనులు చేయడానికి నారసింహ బలమే మనకు కారవలంబం కావాలి కాబట్టి…రాజకీయాలను పక్కన పెట్టి…ఈ పుణ్య కార్యంలో అందరూ పాల్గొనాలి.

ఒక సోమనాథ్, ఒక బద్రీనాథ్, ఒక కేదార్ నాథ్, ఒక తిరుమల ఎలాగో ఒక యాదగిరిగుట్ట అలాగే విశ్వ ఆధ్యాత్మిక చిత్రపటం మీద నిలిచిపోవాలి.

భక్తికి భావన ఆలంబన.
ఆ భావనకు నూత్న యాదగిరిగుట్ట అమితాలంబన కాబోతోంది.
రండి…మనమూ పాల్గొని పునీతులమవుదాం.

(నమస్తే తెలంగాణాలో ప్రచురితమయిన వ్యాసం)

-కాశ్యప్

Also Read : యాదాద్రికి చేరిన గోదావరి జలాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్