రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసినా అభివృద్ధి సూచికలో మనం చివరి స్థానంలో ఉన్నామని, మన కంటే పంజాబ్, కేరళ అప్పులు చేశాయని, అయితే ఆ రాష్ట్రాలు హ్యూమన్ ఇండెక్స్ లో ముందంజలో ఉన్నాయని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, ఎక్కడైనా, ఎప్పుడైనా తాను వస్తానని సవాల్ చేశారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో యనమల మీడియాతో మాట్లాడారు. పంజాబ్ లో వ్యవసాయం పురోగతిలో ఉందని, కానీ ఇక్కడ రైతుల పరిస్థితి బాగాలేదని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
1956 నుంచి 2019 నాటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అప్పు 2.75 లక్షల కోట్ల రూపాయలని, ఇప్పుడు అది 8.50 లక్షల కోట్లకు చేరుకుందని… అంటే మూడేళ్ళలో ఏటా రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని అన్నారు. గతంలో అప్పులు చేసినా పరిమితులకు లోబడి చేశారని, కానీ ఇపుడు ఇష్టానుసారం అప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 2024లో ఈ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏపీ అప్పు 11 లక్షల కోట్ల రూపాయలు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఏటా లక్ష కోట్ల రూపాయలు వడ్డీ, వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
ఎప్పుడు తమ ప్రభుత్వం కూలిపోతుందనే భయం, నిరాశా నిస్పృహల్లో వైసీపీ నేతలు ఉన్నారని, ఆ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీలో తప్పు ఏముందని యనమల ప్రశ్నించారు. ప్రధాని మోడీతో సిఎం జగన్ కలిసిన అధికారిక సమావేశాల వివరాలే బైట పెట్టడం లేదని, అలాంటప్పుడు బాబు-పవన్ మీటింగ్ వివరాలు బైట పెట్టడంలో ఔచిత్యం లేదన్నారు. ఆ పార్టీ కేడర్ లో స్థయిర్యం నిలుపుకునేందుకే గాభీర్యం ప్రదర్శిస్తున్నారని, అందుకే 175 సీట్లు గెలుస్తామని చెబుతున్నారని, కానీ ఆ పార్టీకి సింగల్ డిజిట్ కు మించి రావని యనమల జోస్యం చెప్పారు. . ప్రభుత్వ విధానాలపై విపక్ష పార్టీలతో కలిసి పోరాడడం వేరని, ఎన్నికల్లో పొత్తులు వేరని విశ్లేషించారు.
తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళ ప్రస్థానంలో తనకూ భాగస్వామ్యం ఉందని, ఎన్టీఆర్ తొలి కేబినేట్ లో కూడా తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తిండి, బట్ట, ఇల్లు నినాదంతో ప్రాంతీయ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది ఎన్టీఆర్ అని రామకృష్ణుడు కొనియాడారు. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు వచ్చినా చాలా వరకూ తక్కువ కాలంలోనే అంతరించి పోయాయని… కానీ టిడిపి ఇన్నేళ్ళు మనుగడ సాగించి, జాతీయ స్థాయిలో కూడా ప్రముఖ పాత్ర పోషించిందని యనమల వివరించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ప్రజలు మార్పు కోరుకుని ఆదరించారని, అదే కోవలో రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలు విశ్వసించి విజయం ఇచ్చారని…. ఇప్పుడు మరోసారి ప్రజలు రాష్ట్రంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.
జాతీయ పార్టీలతో సమానంగా తెలుగుదేశం పార్టీ మనుగడ సాగిస్తూ ఉండడం ఓ గొప్ప విషయమన్నారు. ఇప్పటికీ ప్రజల్లో పార్టీపై విశ్వాసం సన్నగిల్లలేదని అభిప్రాయపడ్డారు. కానీ వైసీపీ అధికారం చేపట్టిన మూడున్నరేళ్లలోనే భ్రష్టు పట్టిందని… వారి విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యలే కారణమని విమర్శించారు.
సంక్షేమం, పరిపాలనా వికేంద్రీకరణ, మహిళలకు రిజర్వేషన్స్, బిసిలకు పెద్ద పీట లాంటి అంశాల్లో తెలుగుదేశం పార్టీయే దిక్సూచిగా నిలుస్తోందన్నారు. ప్రజల పక్షాన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి, ఇప్పుడున్న తరానికి అనుగుణంగా విధానాలు తీసుకొని, యువతకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే భవిష్యత్ లో మనుగడ ఉంటుందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల సమర్ధ నాయకత్వం వల్లే తాము నలభై ఏళ్ళపాటు బలంగా నిలిచామన్నారు.