విశాఖపట్నం టెస్టులో ఇండియన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ తో జరుగుతోన్నరెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లతో 209 పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో ఎనిమిదో వికెట్ గా ఔటయ్యాడు.
నిన్న మొదటిరోజు 179 పరుగులతో నాటౌట్ గా నిలిచిన జైస్వాల్ నేడు తన టెస్ట్ కెరీర్ లో తొలి డబుల్ నమోదు చేసి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో ఇండియన్ బ్యాట్స్ మెన్ గా రికార్డు నమోదు చేసుకున్నాడు. గతంలో వినోద్ కాంబ్లీ 21 సంవత్సరాల 32 రోజులు; సునీల్ గవాస్కర్ 21 ఏళ్ళ 277 రోజుల వయసులో ఈ రికార్డు సాధించగా నేడు జైస్వాల్ 22 ఏళ్ళ 77 రోజుల వయసులో డబుల్ సెంచరీ చేశాడు.
కాగా నిన్న 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసిన ఇండియా మరో 60 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది. అశ్విన్ 20; కుల్దీప్ 8; బుమ్రా 6 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ తలా మూడు; టామ్ హార్ట్ లీ ఒక వికెట్ పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ లంచ్ విరామానికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. జాక్ క్రాలే-15; బెన్ డక్కెట్-17 పరుగులతో క్రీజులో ఉన్నారు.