Saturday, January 18, 2025
HomeTrending Newsఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు...ఎల్లో అలర్ట్‌ జారీ

ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు…ఎల్లో అలర్ట్‌ జారీ

ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు మరో కోల్డ్‌ స్పెల్‌ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఈ రోజు (సోమవారం) ఉదయం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. దీంతో ప్రజలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్‌లో ఇంత తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీలో నేటి నుంచి మరో ఆరు రోజులపాటు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఈ రోజు (సోమవారం) ఉదయం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల సెల్సియస్‌గా, లోధి రోడ్డులో 1.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. మరోవైపు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టంగా అలముకొన్న పొగమంచు కారణంగా 13 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇండియన్‌ రైల్వేస్‌ ప్రకటించింది. పలు విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు వెల్లడించారు.

రానున్న ఐదు రోజుల్లో ఢిల్లీ సహా పంజాబ్‌, హర్యాన, చండీగఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల్లో దట్టమైన మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలి గాలులతో జనవరి 18 వరకు ఆయా ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈనెల 5 నుంచి 9వ తేదీల మధ్య ఏర్పడిన కోల్డ్‌ స్పెల్‌ కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఇంతటి తక్కువ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇది రెండోసారి. ఐఎండీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 15 రోజుల్లో 50 గంటలపాటు పొగమంచు కురిసింది. 2019 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో మంచు కురవడం ఇదే తొలిసారి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్