తెలంగాణా హైకోర్టులో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ఈనెల 25 వరకూ ఆయన్ను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, సిబిఐ విచారణకు సహకరించాలని అవినాష్ రెడ్డిని ఆదేశించింది. మాజీ మంత్రి వైస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని నిన్న సోమవారం విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఇదే కేసులో అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకున్న దృష్ట్యా, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అవినాష్ తెలంగాణా హైకోర్టులో నిన్న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం కేసును నేటికి వాయిదా వేసింది. వివేకా కుమార్తె సునీత కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. నేడు విచారణ సందర్భంగా సిబిఐ-అవినాష్ రెడ్డి- సునీత లాయర్లు తమ వాదనలను బలంగా వినిపించారు. ఓ దశలో వివేకా-సునీతల లాయర్ల మధ్య వాదోపవాదాలు కూడా జరిగినట్లు సమాచారం.
వాదనలు విన్న ధర్మాసనం కేసును మళ్ళీ 25న విచారించి తుది తీర్పు ఇస్తామని, అప్పటి వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది. సిబిఐ ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్లాలని, ఈ ప్రక్రియను ఆడియో-వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.