Sunday, September 29, 2024
HomeTrending Newsప్రతిపక్ష హోదాతోనే చట్టబద్ధ భాగస్వామ్యం: స్పీకర్ కు జగన్ లేఖ

ప్రతిపక్ష హోదాతోనే చట్టబద్ధ భాగస్వామ్యం: స్పీకర్ కు జగన్ లేఖ

చట్ట సభల్లో విపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలన్న నిబంధన  చట్టంలో ఎక్కడా లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నారని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాశారు. ఇటీవల శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం కూడా పద్ధతులకు విరుద్ధమని ఆక్షేపించారు.

విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. కానీ అటు పార్లమెంటులో గానీ, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకాని ఈ నిబంధన పాటించలేదని అభిప్రాయపడ్డారు. ఏపీలో అధికార కూటమి, స్పీకర్‌ ఇప్పటికే తన పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. జగన్ ను చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్‌ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని,  ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడంలేదని అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్ష హోదాతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని,  సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని స్పీకర్ దృష్టికి తీసుకు వచ్చారు.  ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించి ప్రతిపక్ష హోదా ఇచ్చేలా చూడాలని లేఖలో జగన్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్