వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు బెంగుళూరులో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సమయంలో కూడా షర్మిల ట్వీట్ చేస్తూ డీకే దంపతులతో దిగిన ఫోటోను షేర్ చేశారు. కాంగ్రెస్ గెలుపులో డీకే పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు.
ఆ తర్వాత పరిణామాల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారని, డీకే ద్వారా ఆమెతో ప్రియాంక గాంధీ సంప్రదింపులు జరిపారని వార్తలు వచ్చాయి. వీటిపై షర్మిల స్పందిస్తూ డీకే ఎప్పటినుంచో తమ కుటుంబానికి సన్నిహితుడని, వైఎస్ అంటే ఆయనకు ఎంతో అభిమానమని వ్యాఖ్యానించారు. పైగా తనకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ సంప్రదింపుల విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
ఈ విషయమై తెలంగాణా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి- షర్మిల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. షర్మిల కాంగ్రెస్ లోకి రావాలనుకుంటే ఏపీ కాంగ్రెస్ లో బాధ్యతలు చేపట్టవచ్చని, ఇక్కడ ఆ అవసరం లేదని, ఆమెను ఓ ఆడబిడ్డగా చీర సారె పెట్టి గౌరవిస్తామని అంతకుమించి తెలంగాణా పార్టీలో ఆమె అవసరం లేదని, ఆమె ఇక్కడ స్థానికేతరాలు అన్న అర్ధం వచ్చేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై షర్మిల కూడా ఘాటుగా స్పందించి… విదేశీ వనిత అయిన సోనియాను కూడా అదే మాట అంటారా అంటూ ఎదురు ప్రశ్నించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి షర్మిల ఈరోజు డికేతో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.