వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం(జనవరి-04) కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక భాగమని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలను న్యాయం చేసే పార్టీ అని వెల్లడించారు.
కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం
వైఎస్సార్ తన జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారని చెప్పారు. మా నాన్న అడుగు జాడల్లోనే నడుస్తున్నాని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం తన తండ్రి కల అన్నారు. రాహుల్ జోడో యాత్ర వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. జోడో యాత్ర ప్రజలతోపాటు తనలో కూడా విశ్వాసాన్ని నింపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఎన్నికల్లో పోటీ చేయలేదని స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన షర్మిల. షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కుమార్ ఉన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరికపై ఏపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం కోసం షర్మిల వస్తే మనస్పూర్తిగా ఆహ్వానిస్తామని వెల్లడించారు.