మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై వైసీపీ నిరసన తెలిపింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్యానర్లు చేతబట్టుకొని, నల్ల కండువాలు ధరించి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. అయితే ప్లే కార్డులు అసెంబ్లీలోకి అనుమతించేది లేదని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
ఓ పోలీసు అధికారి ఒక ఎమ్మెల్యే చేతిలోని ప్లే కార్డును తీసుకొని చించివేశారు. దీనిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వద్దనుంచి పేపర్లు లాక్కొని చింపే అధికారం ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. సదరు అధికారి పేరు ప్రస్తావిస్తూ మధుసూదన రావు గుర్తు పెట్టుకో ఎల్లకాలం పరిస్థితి ఇలాగే ఉండదు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.
ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే వైసీపీ సభ్యులు… సేవ్ డెమోక్రసీ, హత్యా రాజకీయాలు నశించాలి, వుయ్ వాంట్ జస్టిస్ నినాదాలతో కాసేపు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభనుంచి వాకౌట్ చేశారు.